New Del: తుపాకీ కాల్పుల నుంచి అన్నను కాపాడబోయిన మహిళల దుర్మరణం!
- ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన
- అప్పు ఇచ్చిన వ్యక్తిపై అర్ధరాత్రి దాడి చేసిన నిందితుడు
- మరికొందరితో కలిసి బాధితుడిపై కాల్పులు
- తమ అన్నను కాపాడేప్రయత్నంలో అతడి సోదరీమణులకు బుల్లెట్ గాయాలు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
అప్పు తీసుకున్న వ్యక్తి దాడి నుంచి తమ అన్నని కాపాడబోయిన ఇద్దరు యువతులు కాల్పులకు బలయ్యారు. దేశరాజధాని ఢిల్లీలో ఈ దారుణం వెలుగు చూసింది. నగరంలోని అంబేద్కర్ బస్తీకి చెందిన లలిత్ గతంలో ఓ వ్యక్తికి రూ. 10 వేలు అప్పుగా ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తిరిగివ్వమని అతడిని శనివారం అడగ్గా వారి మధ్య వివాదం చెలరేగింది.
ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి అప్పు తీసుకున్న వ్యక్తి మరికొందరితో కలిసి వచ్చి లలిత్ ఇంటి తలుపు బాదాడు. ఆ తరువాత అతడి ఇంటిపై రాళ్లు రువ్వారు. దీంతో, కంగారు పడిపోయిన లలిత్ సోదరుడు అదే ప్రాంతంలో ఉంటున్న తమ తోబుట్టువులు, బంధువులకు సమాచారం అందించాడు. వారు లలిత్ ఇంటికి రాగానే అప్పుతీసుకున్న వ్యక్తి, అతడి వెంట ఉన్న వారు పరారయ్యారు.
మరికొద్ది సేపటికి తిరిగొచ్చిన వారు లలిత్‌పై తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో లలిత్‌ను కాపాడేందుకు అతడి సోదరీమణులు పింకీ(30), జ్యోతి(29) ప్రయత్నించి తీవ్రగాయాలపాలయ్యారు. ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లలిత్‌కూ స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడిపై దాడి చేసిన వారిలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు డీసీపీ తెలిపారు.