Telangana: ప్రపంచంలోని అలాంటి అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ ఒకటి: హరీశ్‌రావు
- మౌలిక సదుపాయాలతో పాటు పచ్చదనం కూడా అభివృద్ధి చెందుతుందన్న ఆర్థిక శాఖ మంత్రి
- రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.7 శాతం పెరిగిందని వెల్లడి
- దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు హరిత ఉత్సవం నిర్వహిస్తున్న ప్రభుత్వం
అన్నిరకాల మౌలిక సదుపాయాలతో పాటు పచ్చదనం కూడా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలోని అరుదైన ప్రదేశాల్లో తెలంగాణ ఒకటని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. అందుకు రాష్ట్రంలో 7.7 శాతం పెరిగిన గ్రీన్ కవర్ నిదర్శనం అన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రవేశ పెట్టిన హరితహారం ప్రోగ్రాం వల్లనే ఇది సాథ్యమైందన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ రోజు హరిత ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితాలను హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
హరితహారంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,864 నర్సరీలను, 19,472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 13.44 లక్షల ఎకరాల్లో అడవులను పునరుద్ధరించామని తెలిపారు. ఇప్పటివరకు 273 కోట్ల మొక్కలను నాటామన్నారు. సీఎం కేసీఆర్ వంటి నిజమైన పర్యావరణవేత్తే సమగ్ర, స్థిరమైన అభివృద్ధి గురించి ఆలోచిస్తారని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రభుత్వం ఏం చేయాలో ప్రపంచానికి తెలంగాణ సగర్వంగా చాటిచెప్పిందని తెలిపారు. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందని మంత్రి ట్వీట్ చేశారు.