CM KCR: ‘తెలంగాణ కొంచెం పచ్చవడ్డది’.. హరితోత్సవంలో సీఎం కేసీఆర్
- తుమ్మలూరులో హరితహారం 9వ విడతను ప్రారంభించిన ముఖ్యమంత్రి
- హరితహారం అంటే కాంగ్రెస్ నాయకులు నవ్వారన్న కేసీఆర్
- తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని వెల్లడి
- గ్రామ సర్పంచులను ప్రత్యేకంగా అభినందించిన సీఎం
హరితహారం కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు శాసన సభలో నవ్వుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని వివరించారు. పట్టుబట్టి ప్రారంభించిన హరితహారంతో ఇప్పుడు తెలంగాణ కొద్దిగా పచ్చబడిందని చెప్పారు. తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయని వివరించారు. ఈ క్రెడిట్ రాష్ట్రంలోని సర్పంచులకే మొదట చెందుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచులతో పాటు రాష్ట్ర ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన హరితోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. హరితహారం 9వ విడత కార్యక్రమాన్ని ఆయన ఓ మొక్క నాటి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
హరితహారం కార్యక్రమంలో 2013 నుంచి 2023 వరకు273.33 కోట్ల మొక్కలు నాటినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,822 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13,657 ఎకరాల విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇక 6,298 ఎకరాల విస్తీర్ణంలో 2,011 బృహత్ ప్రకృతి వనాలు, 1,00,691 కిలోమీటర్ల మేర రాష్ట్రం అంతటా రహదారి వనాలు ఏర్పాటు చేశామని కేసీఆర్ వివరించారు.
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు అన్నీ దాదాపు 85 శాతం పూర్తయ్యాయని తెలిపారు. గోదావరి నీళ్లను గండిపేట, హిమాయత్ సాగర్ వరకు తీసుకొస్తామని, రాబోయే కొద్ది రోజుల్లోనే చేవెళ్ల ప్రాంతానికి నీళ్లు అందిస్తామని తెలిపారు.