adipurush: ప్రభాస్‌ను ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను: ఆదిపురుష్ దర్శకుడు ఓంరౌత్
- ఈ సినిమాను కొత్తతరం కోసం చేసినట్లు తెలిపిన దర్శకుడు
- ఆదిపురుష్ చేయాలనుకున్న రోజే రాముడి పాత్రలో ప్రభాస్ ను ఊహించుకున్నట్లు వెల్లడి
- ప్రభాస్ అన్ని విధాలుగా సహకరించాడన్న ఓంరౌత్
ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ను ఎంపిక చేసుకోవడానికి గల కారణాలను చిత్ర దర్శకుడు ఓంరౌత్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ పాత్ర కోసం ప్రభాస్ ను ఒప్పించడానికి తాను చాలా కష్టపడ్డానని చెప్పారు. తాను ఈ సినిమాను చేయాలనుకున్నప్పటి నుంచీ ప్రభాస్ ను మాత్రమే రాముడిగా ఊహించుకున్నట్లు తెలిపారు. ఈ సినిమాను కొత్తతరం కోసం తీశానని స్పష్టం చేశారు. మొత్తం రామాయణాన్ని తెరపై చూపించడం సాధ్యంకాని పని అని, అందుకే యుద్ధకాండను మాత్రమే ఎంచుకున్నట్లు తెలిపారు.
తనకు వ్యక్తిగతంగా కూడా ఈ యుద్ధకాండ భాగం ఇష్టమన్నారు. ఇందులో రాముడు పరాక్రమవంతుడిగా కనిపిస్తాడని, ఈ పాత్రకు ప్రభాస్ పూర్తిగా సరిపోతాడని తాను భావించానని చెప్పారు. మన హృదయంలోని భావాలు కళ్లలో కనిపిస్తాయని నమ్ముతానని, ప్రభాస్ కళ్లలో నీతి, నిజాయతీ కనిపిస్తాయన్నారు. ప్రభాస్ చాలా పెద్దస్టార్ అయినప్పటికీ ఎంతో వినమ్రతతో ఉంటారని చెప్పారు. అందుకే తాను సినిమాను చేయాలనుకున్న రోజునే రాముడిగా ప్రభాస్ ను ఊహించుకొని, అతనే సరైన ఎంపికగా భావించానన్నారు.
ఆదిపురుష్ సినిమాలో నిన్ను రాముడిగా ఎంచుకున్నానని తాను ప్రభాస్ తో చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడని గుర్తు చేసుకున్నారు. అతనిని ఒప్పించడానికి చాలా కష్టపడినట్లు చెప్పారు. ఫోన్ లో ఈ పాత్రకు సంబంధించిన వివరాలను చెప్పడానికి చాలా కష్టపడ్డానని, ఆ తర్వాత అతనిని కలిసి స్టోరీ చెప్పిన తర్వాత ఓకే చెప్పాడన్నారు. ప్రభాస్ అన్నివిధాలుగా సహకరించినట్లు చెప్పారు. భవిష్యత్తులోను తమ స్నేహం ఇలాగే కొనసాగుతుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు.