MSK Prasad: ఏపీకి ఐపీఎల్ టీమ్ వస్తుందా? రాదా? అనే ప్రశ్నకు ఎమ్మెస్కే ప్రసాద్ స్పందన ఇదే!
- ఐపీఎల్ ఫ్రాంఛైజీలు రాష్ట్రాల పేరు మీద ఉండవన్న ఎమ్మెస్కే
- మార్కెట్ ఉన్న చోటే ఫ్రాంఛైజీలు పెట్టుబడులు పెడతాయని వ్యాఖ్య
- రాష్ట్రానికి ఒక టీమ్ పెడితే 29 జట్లు ఉండాలన్న మాజీ చీఫ్ సెలెక్టర్
క్రికెట్ లో ఐపీఎల్ కు ఉన్న పాప్యులారిటీ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ లో ఆడేందుకు విదేశీ ప్లేయర్లు సైతం కలలు కంటుంటారు. ఐపీఎల్ లో ఆడితే డబ్బుతో పాటు ఎంతో క్రేజ్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఐపీఎల్ లో ఇప్పటికే ఎన్నో ఫ్రాంఛైజీలు ఉన్నాయి. అయితే నూతన ఏపీ రాష్ట్రం అవతరించి దాదాపు పదేళ్లు అవుతోంది. అయినప్పటికీ ఏపీకి ఐపీఎల్ జట్టు లేకపోవడం రాష్ట్రంలోని క్రికెట్ క్రీడాభిమానులను నిరాశకు గురి చేస్తోంది. దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు, మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు.
ఐపీఎల్ టీమ్ అనేది రాష్ట్రాల పేరు మీద ఉండదని ఎమ్మెస్కే చెప్పారు. ఇప్పటికే దక్షిణాది నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఉన్నాయని తెలిపారు. తూర్పు రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రమే ఉందని చెప్పారు. రాష్ట్రానికో టీమ్ కావాలంటే ఐపీఎల్ లో 29 జట్లు ఉండాలని అన్నారు.
మార్కెట్ ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ ఫ్రాంఛైజీలు జట్లను తీసుకొస్తాయని చెప్పారు. రూ. 7 వేల కోట్లు పెట్టి టీమ్ ను కొనుగోలు చేసినప్పుడు... కనీసం రూ. 10 వేల కోట్ల నుంచి 12 వేల కోట్ల వరకు రిటర్న్ లను ఫ్రాంఛైజీలు ఆశిస్తాయని అన్నారు. హైదరాబాద్ పేరుతో ఇప్పటికే ఒక జట్టు ఉందని... ఏపీలో మరో జట్టు వస్తే కొత్త జట్టుకు అంతే క్రేజ్ ఉంటుందా? అనేది కూడా కీలక అంశమని చెప్పారు. ఎమ్మెస్కే చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పట్లో ఏపీకి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాకపోవచ్చనే విషయం అర్థమవుతోంది.