Not just aircrafts: సన్నద్ధతపై ఆనంద్ మహీంద్రా నుంచి ఆలోచింపజేసే వీడియో!
- టేకాఫ్ కు ముందు సన్నాహాలు విమానానికే అని ఎవరు చెప్పారంటూ ప్రశ్న
- కీటకాలు గాల్లోకి ఎగరడానికి ముందు సంసిద్ధమయ్యే వీడియో షేర్
- ముందస్తు సన్నాహం లేకుండా ఏదీ ప్రారంభించొద్దంటూ సందేశం
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పదిమందిని ఆలోచింపజేసే వీడియోతో సామాజిక మాధ్యమంలో పలకరించారు. స్ఫూర్తి నిచ్చే, ఆలోచింపజేసే వీడియోలను, వింతలను, అరుదైన విశేషాలను ఆయన తరచూ పది మందితో పంచుకుంటూ ఉంటారు. దీన్ని సమాజం కోసం అనే భావనతో చేస్తుంటారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో.. ప్రతి దానికీ సన్నద్ధత అవసరం అన్న సందేశాన్ని ఇచ్చేలా ఉంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో కీటకాలు.. ఎగరడానికి ముందు సన్నద్ధం కావడం కనిపిస్తుంది. ముందుగా రెక్కలు విప్పి, రెక్కలను ఆడించిన తర్వాత పైకి లేవడాన్ని గమనించొచ్చు.
‘‘ఫ్లయిట్ ప్రారంభం కావడానికి ముందు కసరత్తు కేవలం విమానాలకే చేస్తారని ఎవరు చెప్పారు? అని ఆనంద్ మహీంద్రా ప్రశ్నించారు. ‘‘ఈ అద్భుతమైన ఫొటోల్లో ఎగరడానికి ముందు భిన్న భంగిమలను చూడొచ్చు. సహజసిద్ధమైన టేకాఫ్ కు ప్రకృతిపరంగా సహజమైన సన్నద్ధత ఇది. ముందస్తు సన్నాహం లేకుండా ఏదీ ప్రారంభించొద్దు. దీనికి మరో ప్రత్యామ్నయం లేదు’’ అని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్ లో సందేశం ఇచ్చారు.