Elon Musk: అవే లేకపోతే నేను చచ్చిపోయే వాడిని: ఎలాన్ మస్క్
- ఆధునిక ఔషధాలు కలిగి ఉండడం మన అదృష్టమన్న మస్క్
- క్లోరోక్విన్, డాక్సీసైక్లిన్ లేకపోతే మలేరియాతో చనిపోయే వాడినని వెల్లడి
- ఔషధాల పనితీరును ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉండాలని వ్యాఖ్య
గతంలో తాను మలేరియా బారిన పడిన ఘటనపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆధునిక ఔషధాలు కలిగి ఉండడం నేటి ప్రపంచం చేసుకున్న గొప్ప అదృష్టమని చెప్పిన ఆయన.. అవే తనను మలేరియా నుంచి రక్షించాయని చెప్పారు. ఔషధ కంపెనీలపై ఓ వ్యక్తి చేసిన ట్వీట్ కు మస్క్ బదులిచ్చారు.
‘‘నిజం చెప్పాలంటే.. ఆధునిక ఔషధాలు కలిగి ఉండడం మన అదృష్టం. క్లోరోక్విన్, డాక్సీసైక్లిన్ ఇచ్చి ఉండకపోతే నేను మలేరియా వల్ల మరణించి ఉండేవాణ్ని. అయినప్పటికీ ఔషధాలను పవిత్రంగా భావించడానికి బదులు వాటిని మనం ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉండాలి. శాస్త్ర విజ్ఞాన పునాదులే ప్రశ్నించడంపై ఉన్నాయి. తద్వారా వాస్తవానికి చేరువయ్యే ప్రయత్నం చేయాలి’’ అని మస్క్ రాసుకొచ్చారు.
దీనికి ఆయన తల్లి మే మస్క్ స్పందిస్తూ.. ‘‘నీకు మలేరియా సోకడం నాకు స్పష్టంగా గుర్తుంది. ఆ సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లావు. కొన్ని రోజుల పాటు వణికిపోయావు. నీ శరీరంలోకి అనేక ట్యూబులను అమర్చారు. అది చాలా భయంకరమైన కాలం. ఆధునిక ఔషధాలే నిన్ను రక్షించాయి’’ అని ట్వీట్ చేశారు.