Karnataka High Court: శృంగారానికి నిరాకరించిన భర్త.. తప్పేమీ కాదన్న కర్ణాటక హైకోర్టు
- భార్యతో శారీరక బంధానికి నిరాకరించిన భర్త
- పెళ్లయిన 28 రోజులకే పుట్టింటికి చేరిన భార్య
- క్రూరత్వమే అయినా నేరం కాదన్న కోర్టు
- క్రిమినల్ కేసులు కొట్టివేత
ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్న భర్త.. తన భార్యతో శారీరక సంబంధాన్ని నిరాకరించడంతో ఆమె కోర్టుకెక్కింది. హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహ బంధం పరిపూర్ణం కాలేదని, పెళ్లిని రద్దు చేయాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో కేసు హైకోర్టుకు చేరగా న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. భార్యతో శారీరక సంబంధాన్ని నిరాకరించడం నేరం కాదని తేల్చి చెప్పింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 18 డిసెంబరు 2019లో ఆమెకు వివాహమైంది. భర్త పూర్తిగా ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరుచుకోవడంతో ఆమెతో శారీరక సంబంధానికి నిరాకరించాడు. దీంతో ఆమె 28 రోజుల తర్వాత పుట్టింటికి వచ్చేసింది. ఫిబ్రవరి 2020లో భర్త, అత్తమామలపై వరకట్న నిరోధక చట్టం కింద కేసు పెట్టింది. అలాగే, హిందూ వివాహ చట్టం ప్రకారం తన వివాహ బంధం పరిపూర్ణం కాలేదని, కాబట్టి పెళ్లిని రద్దు చేయాలని కోరింది.
అదే ఏడాది నవంబరులో ఫ్యామిలీ కోర్టు ఆ వివాహాన్ని రద్దు చేసింది. అయితే, అత్తింటి వారిపై పెట్టిన క్రిమినల్ కేసులను మాత్రం ఆమె వెనక్కి తీసుకోలేదు. దీంతో ఆమె భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. తనపైనా, తన తల్లిదండ్రులపైనా నమోదైన చార్జ్‌షీట్‌ను కొట్టివేయాలని కోరాడు. విచారించిన హైకోర్టు అతడికి అనుకూలంగా తీర్పు చెప్పింది.
భర్త శారీరక సంబంధానికి దూరంగా ఉంటున్నాడన్నది మాత్రమే అతడిపై ఉన్న ఆరోపణ అని, హిందూ వివాహ చట్టం ప్రకారం ఇది క్రూరత్వమే అయినా, సెక్షన్ 498ఏ ప్రకారం అది క్రిమినల్ నేరం కిందికి రాదని స్పష్టం చేస్తూ అతడిపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న అతడు ప్రేమ అంటే కేవలం మనుషులకు సంబంధించినది మాత్రమే కానీ, శారీరక బంధం కాదని విశ్వసించాడని కోర్టు పేర్కొంది.