Health: భారత ఓటర్ల మొదటి మూడు డిమాండ్లు ఏవో తెలుసా?
- విద్య, ఉపాధి కల్పన, ఆరోగ్యానికి పెద్ద పీట
- దేశంలోని ఐదు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో వెల్లడి
- ఆరోగ్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటున్న ఓటర్లు
మన దేశంలో ఓటర్లు అసలు వేటిని కోరుకుంటున్నారు? వారి ప్రాధాన్యం వేటికి? దీనిపై లోక్ నీతి - సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ ప్రోగ్రెస్, కింగ్స్ ఇండియా ఇనిస్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర సంస్థలు ఓటర్లను సర్వే చేశాయి. బీహార్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటర్ల సర్వే జరిగింది.
అభివృద్ధి కావాలని ఎక్కువ మంది ఓటర్లు చెప్పారు. అభివృద్ధి అంటే ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలు, తాగునీటి వసతి, పారిశుద్ధ్యం సదుపాయం ఇవన్నీ వారి ప్రాధాన్యతలుగా ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధిలో భాగంగా ఓటర్లు కోరుకుంటున్న మొదటి మూడింటిలో విద్య ఒకటి. ఉద్యోగ కల్పన మరొకటి. ఇక 20 శాతం మంది ఓటర్లు ఆరోగ్యం గురించే ఆందోళన వ్యక్తం చేశారు.
కాస్త వయసు పైబడిన వారికి ఆరోగ్యమే తొలి ప్రాధాన్యత అంశంగా ఉంది. 25 ఏళ్లలోపు ఓటర్లలో 12 శాతం మంది ఆరోగ్యానికి మొదటి ఓటు వేయగా.. 56 ఏళ్లు పైబడిన వారిలో 26 శాతం మంది ఆరోగ్యం తమకు ముఖ్యమని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యతని 80 శాతం మంది చెప్పారు. అన్ని రకాల ఎన్నికల్లో ఆసుపత్రి సదుపాయాల అంశం తమ ఓటును ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల్లో ఓటుపై ఆరోగ్యం అంశం ప్రభావం ఉంటుందని 39 శాతం మంది చెప్పారు.