Jonnavithula: సినీ గేయ రచయిత జొన్నవిత్తుల నేతృత్వంలో ఏపీలో కొత్త రాజకీయ పార్టీ!
- ‘జై తెలుగు’ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు సినీ గేయ రచయిత జొన్నవిత్తుల ప్రకటన
- తెలుగు భాషకు పునర్ వైభవం తీసుకురావాలన్నదే తన సంకల్పమని వ్యాఖ్య
- రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడి
తెలుగు భాషా పరిరక్షణ కోసం ‘జై తెలుగు’ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రకటించారు. రాజకీయ నాయకులకు, ప్రజలకు సరైన అవగాహన కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు. వారిని చైతన్యవంతులను చేయడానికే పార్టీని పెడుతున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఏర్పాటు గురించి జొన్నవిత్తుల ప్రకటించారు.
భాషకు పునర్ వైభవం తీసుకురావాలన్నదే తన సంకల్పమని చెప్పారు. తెలుగు భాష, పరిరక్షణ అజెండాతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. ఆగస్ట్ 15 నాటికి తమ పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ బాగా నష్టపోయిందని జొన్నవిత్తుల అన్నారు. భాషా సంస్కృతి పూర్తిగా వీధిన పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘జై తెలుగు’ పేరుతో ఐదు రంగులతో పతాకాన్ని రూపొందించానని జొన్నవిత్తుల తెలిపారు. నీలం రంగు.. జలం, పచ్చ రంగు.. వ్యవసాయం, ఎరుపు రంగు.. శ్రమశక్తి, పసుపు.. వైభవానికి, తెలుపు.. స్వచ్ఛతకు చిహ్నంగా రూపొందించినట్లు చెప్పారు. తెలుగు భాష రథాన్ని ప్రజలు లాగాలనేది తన ఆకాంక్షగా జొన్నవిత్తుల చెప్పుకొచ్చారు.
తెలుగు భాష కోసం ఐదుగురు మహనీయులు కృషి చేశారని.. త్యాగాలు చేశారని వెల్లడించారు. గిడుగు రామ్మూర్తి నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రాలు తన జై తెలుగు రాజకీయ జెండాలో, ఎజెండాలో ఉంటాయన్నారు.
నాడు మదరాసీలు అన్నారని.. నేడు హైదరాబాదీలు అనిపించుకుంటున్నామని, కానీ తెలుగు వాళ్లం అని మాత్రం అనిపించులేక పోతున్నామని జొన్నవిత్తుల ఆవేదన వ్యక్తం చేశారు. మన భాషను మనమే విస్మరించి చులకన చేసుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ భాష మొత్తం ఒక్కటే.. ఏపీలో మాత్రం ప్రాంతాల వారీగా భాష మారిపోతుందన్నారు.