Assam: అసోంలో కుంభవృష్టి... 10 జిల్లాల్లో వరద బీభత్సం
- దేశంలో కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర వడగాడ్పులు
- మరి కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వరదలు
- అసోంలో కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు
- వరద ముంపులో చిక్కుకున్న 31 వేల మంది
- సమీక్ష చేపట్టిన సీఎం హిమంత బిశ్వ శర్మ
దేశంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న స్థితిలో, పదుల సంఖ్యలో ప్రజలు వడగాడ్పులకు బలి కాగా, మరికొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
ఈశాన్య రాష్ట్రం అసోంలో గత కొన్నిరోజులుగా కుంభవృష్టితో జనజీవనం అస్తవ్యస్తం అయింది. 10 జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. 31 వేల మంది వరదల్లో చిక్కుకున్నట్టు గుర్తించారు. ఒక్క లఖింపూర్ జిల్లాల్లోనే 22 వేల మంది వరద ముంపు బారినపడ్డారు.
అసోంలోని కొన్ని పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రానున్న ఐదు రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, శిథిలావస్థలో వున్న ఇళ్లను అధికారులు ముందుగానే కూల్చివేస్తున్నారు.
రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం హిమంత బిశ్వ శర్మ సమీక్ష చేపట్టారు. స్వయంగా కంట్రోల్ రూం నుంచి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.