Narendra Modi: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఎటువైపు ఉన్నామో చెప్పిన ప్రధాని మోదీ!
- రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ది తటస్థ వైఖరి కాదన్న ప్రధాని
- తాము శాంతి వైపు నిలబడుతున్నామని వ్యాఖ్య
- చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని, యుద్ధంతో కాదని హితవు
- సమస్య పరిష్కారానికి భారత్ తాను చేయగలిగినదంతా చేస్తోందని వెల్లడి
ఏడాదిన్నరగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. చర్చల ద్వారానే శాంతి సాధ్యమని భారత్ ముందు నుంచీ చెబుతూనే ఉంది. అయితే పశ్చిమ దేశాలు మాత్రం భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోందంటూ విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా పర్యటనకు బయల్దేరే ముందు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’కు ప్రధాని ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘‘మేం తటస్థ వైఖరి ప్రదర్శిస్తున్నామని కొంతమంది అన్నారు. కానీ మేం తటస్థం కాదు. శాంతి వైపు నిలబడుతున్నాం. దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ప్రతి దేశం గౌరవించాలి. దౌత్యపరమైన మార్గాలు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి. అంతేగానీ యుద్ధంతో కాదు’’ అని స్పష్టం చేశారు.
సమస్య పరిష్కారం కోసం రష్యా, ఉక్రెయిన్ దేశాల అధినేతలు పుతిన్, జెలెన్స్కీతో తాను పలుమార్లు మాట్లాడినట్లు ప్రధాని గుర్తుచేశారు. ‘‘భారత్ తాను చేయగలిగినదంతా చేస్తోంది. ఘర్షణలను పరిష్కరించి ఇరు దేశాల మధ్య శాంతి, స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు చేసే అన్ని ప్రయత్నాలను మేం సమర్థిస్తున్నాం’’ అని చెప్పారు.
భారత్, చైనా మధ్య సంబంధాల గురించీ ప్రధాని ప్రస్తావించారు. ద్వైపాక్షిక బంధాలు నిలబడాలంటే.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత, నిశ్చలమైన పరిస్థితులు చాలా ముఖ్యమని మోదీ అన్నారు. ‘‘సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంపై మాకు విశ్వాసం ఉంది. అదే సమయంలో, భారత్ తన గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధంగా ఉంది’’ అని స్పష్టం చేశారు.
భారత్, అమెరికా మధ్య బంధం మునుపటి కంటే మరింత బలంగా ఉందని ప్రధాని అన్నారు. ఇరు దేశాల నేతల మధ్య అమితమైన విశ్వాసం ఉందన్నారు. ‘‘మేం ఏ దేశ స్థానాన్నీ భర్తీ చేయాలనుకోవట్లేదు. కేవలం ప్రపంచంలో మేం సరైన స్థానాన్ని దక్కించుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాం’’ అని మోదీ వివరించారు.