Bandi Sanjay: పార్టీ పెద్దలను కలుస్తూ ఢిల్లీలో బండి సంజయ్ బిజీబిజీ
- పార్టీ అగ్రనేతలతో బండి సంజయ్ వరుస సమావేశం
- తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై చర్చ
- తెలంగాణలో పార్టీ అగ్రనేతల పర్యటనలపై కూడా చర్చలు!
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. దేశ రాజధానిలో పార్టీ అగ్రనేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై పార్టీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో తెలంగాణలో పార్టీ అగ్రనేతల పర్యటనల పైన కూడా వారితో చర్చిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 25న తెలంగాణకు రానున్నారు. ఈ నెలాఖరున కేంద్రమంత్రి అమిత్ షా సభ ఏర్పాటుకు రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలతో బిజీగా ఉండనున్నారు. విదేశీ పర్యటనల అనంతరం మోదీ తెలంగాణ పర్యటనను కూడా ఖరారు చేయవచ్చు.
విద్యార్థి మృతి.. సంజయ్ ట్వీట్
ఇదిలా ఉండగా, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో కమలాపూర్ మండలం మర్పెల్లిగూడెంలో ఆరో తరగతి విద్యార్థి ధనుష్ మృతి చెందాడు. ఈ ఘటనపై బండి సంజయ్ ట్వీట్ చేశారు.
'తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో కమలాపూర్ మండలం మర్పెల్లిగూడెంలో 6వ తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్ దుర్మరణం దిగ్భ్రాంతికరం. బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్ధిని దశాబ్ది ఉత్సవాలకు తీసుకొచ్చిన ప్రభుత్వమే ఈ మృతికి బాధ్యత వహించాలి. తక్షణమే బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలి.
ప్రజల ఉసురు పోసుకునేందుకే బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందా? ఈ ఉత్సవాల్లో పాల్గొనేలా ప్రభుత్వ యంత్రాగంపై ఒత్తిడి తెస్తున్న ఈ సర్కార్ విద్యార్థులను సైతం బలవంత పెట్టడం దారుణం. ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్న చిన్నారి విగతజీవిగా మారడానికి కారణమెవరు? ఆ తల్లితండ్రుల బాధను ఎవరు తీరుస్తారు? ఏం చెప్పి వారిని ఓదారుస్తారు..?
గతంలో ఖమ్మం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని కొందరు మృతి చెందారు.. వనపర్తి జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కళ్యాణలక్ష్మీ చెక్కు తీసుకునేందుకు వచ్చిన మరో వృద్ధురాలిని రోజంతా వెయిట్ చేయించి ఆమె మృతికి కారణమయ్యారు.. ఇప్పుడు దశాబ్ధి ఉత్సవాల్లో 6వ తరగతి చిన్నారి దుర్మరణం పాలయ్యాడు..
ప్రజల ప్రాణాలు తీసేందుకే మీ సమ్మేళనాలు, ఉత్సవాలు, వేడుకలా..?' అంటూ ఘాటుగా స్పందించారు.