Pakistan: టైటానిక్ శకలాల కోసం వెళ్లిన జలాంతర్గామిలో పాక్ కుబేరుడు సహా ప్రముఖులు
- జలాంతర్గామిలో పాక్ కుబేరుడు షాజాదా, అతని కుమారుడు
- షాజాద్ దావూద్ పాక్ అత్యంత సంపన్నుల్లో ఒకరు
- ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, యూకే-యూఏఈ బిలియనీర్ హమీష్ హార్డింగ్లు
అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ షిప్ శకలాలను చూసేందుకు బయల్దేరి కనిపించకుండా పోయిన జలాంతర్గామిలో బిలియనీర్లు, బడా వ్యాపారవేత్తలు, కార్పోరేట్ దిగ్గజాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రముఖుల్లో పాకిస్థాన్‌కు చెందిన కుబేరుడు 48 ఏళ్ల షాజాదా దావూద్, అతని 19 ఏళ్ల తనయుడు సులేమన్ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ జలాంతర్గామిని నిర్వహిస్తున్న ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ కూడా యాత్రికుల్లో ఉన్నట్లుగా వెల్లడైంది. అలాగే యూకే-యూఏఈ బిలియనీర్ హమీష్ హార్డింగ్, ఫ్రాన్స్ పైలట్ పౌల్ హెన్రీ నార్జియోలెట్ ఉన్నారు.
పాక్ కు చెందిన షాజాద్ దావూద్ ఈ దేశ అత్యంత సంపన్నుల్లో ఒకరు. ఇంగ్రో కార్పోరేషన్ కు వైస్ చైర్మన్. ప్రముఖ పారిశ్రామికవేత్త హుస్సేన్ దావూద్ తనయుడు. ఇంగ్రో కార్పోరేషన్ కంపెనీ పాకిస్తాన్ లో ఎరువులు, వాహన, ఇంధన, డిజిటల్ టెక్నాలజీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. యూకేలోని ఉన్నతవర్గాలతో మంచి సంబంధాలున్నాయి. ఈ జలాంతర్గామిలో షాజాద్, సులేమాన్ ఉన్నట్లుగా కుటుంబం ధ్రువీకరించింది.