Narendra Modi: నేను మోదీకి అభిమానిని: ఎలాన్ మస్క్
- ఆయనంటే తనకు చాలా ఇష్టమని వ్యాఖ్య
- న్యూయార్క్ లో ప్రధానితో భేటీ అయిన టెస్లా అధినేత
- వచ్చే ఏడాది భారత్ లో పర్యటిస్తానన్న మస్క్
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ట్విట్టర్, టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. మోదీకి తాను అభిమానినని చెప్పారు. బుధవారం మోదీతో సమావేశమైన తర్వాత మస్క్ మాట్లాడుతూ వచ్చే ఏడాది తాను భారత్ లో పర్యటించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్ లను భారత్ లోకి తెస్తామన్నారు.
‘భారత భవిష్యత్తు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. అగ్ర దేశాలతో పోలిస్తే భారత్ కు అభివృద్ధి విషయంలో ఎన్నో అవకాశాలున్నాయి. భారత్ లో పెట్టుబడులు ఆకర్షించే విషయంలో ప్రధాని మోదీ నిజమైన శ్రద్ధ చూపుతున్నారు. నేను మోదీకి అభిమానిని. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా ఓపెన్‌గా ఉండాలనుకుంటున్నారు. కొత్త కంపెనీలకు మద్దతుగా ఉండాలనుకుంటున్నారు. నేను వచ్చే ఏడాది భారత్ కు రావాలని ప్లాన్ చేస్తున్నా. అందుకోసం ఆసక్తిగా ఉన్నా. మా స్టార్‌లింక్‌ని భారత్ కు తీసుకురావడానికి మేము ఆశాజనకంగా ఎదురుచూస్తున్నాము. స్టార్‌లింక్ ఇంటర్నెట్ భారతదేశంలోని మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నా. సౌరశక్తి పెట్టుబడులకు భారతదేశం గొప్పదని అనుకుంటున్నా. ప్రధానితో జరిపిన చర్చలు అద్భుతంగా సాగాయి" అని మస్క్ చెప్పుకొచ్చారు.