Virat Kohli: టెస్టుల్లోకి అడుగు పెట్టి 12 ఏళ్లు.. విరాట్ కోహ్లీ ప్రత్యేక ట్వీట్
- భారత టెస్ట్ క్రికెట్ లో జూన్ 20వ తేదీకి ప్రత్యేకత
- గంగూలీ, ద్రావిడ్, కోహ్లీ టెస్ట్ కెరీర్ ఇదే రోజు మొదలు
- 2011లో వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ తో కోహ్లీ ఎంట్రీ
టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీకి టెస్టులంటే ప్రత్యేక మక్కువ. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఓ ప్రత్యేక ట్వీట్ తో అభిమానులను పలకరించాడు. భారత టెస్ట్ క్రికెట్ లో జూన్ 20వ తేదీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ ఇదే రోజు టెస్టు ఫార్మాట్ లోకి అడుగు పెట్టారు. గంగూలీ, ద్రావిడ్ 1996లో జూన్ 20న ప్రవేశించగా.. వీరిలో గంగూలీ సెంచరీ, ద్రావిడ్ 95 పరుగులు సాధించారు.
ఇక విరాట్ కోహ్లీ 2011లో వెస్టిండీస్ పై కింగ్ స్టన్ లో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. తొలి టెస్టు మ్యాచులో కోహ్లీ 4,15 పరుగులు చేశాడు. నాటి సిరీస్ మొత్తం మీద మూడు టెస్టుల్లో కోహ్లీ సాధించిన పరుగులు 76. అదే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లోనూ కోహ్లీ అవకాశం సొంతం చేసుకున్నాడు. తాను టెస్టుల్లోకి ప్రవేశించిన రోజు కావడంతో విరాట్ కోహ్లీ మంగళవారం ట్విట్టర్ లో ఒక ట్వీట్ పెట్టాడు. ‘‘నేటితో టెస్టు క్రికెట్ లో 12 ఏళ్లు. ఎప్పటికీ కృతజ్ఞతలు’’ అంటూ తన అభిమానం, గౌరవాన్ని చాటుకున్నాడు. కోహ్లీకే ప్రత్యేకమైన కవర్ డ్రైవ్ షాట్ ఫొటోను పంచుకున్నాడు.