Opposition parties: ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్షాల భేటీ
- బీహార్ సిఎం నితీశ్ ఇంట్లో సమావేశం
- విపక్షాల ఐక్యతలో తొలి అడుగు
- హాజరుకానున్న 15 పార్టీల నేతలు
విపక్షాల ఐక్యతకు తొలి అడుగు ఈ నెల 23న పడనుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన 15 ప్రతిపక్షాల నేతలు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇంట్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయని సమాచారం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొనే విషయంపై ఈ భేటీలో చర్చించనున్నారు. పాట్నాలోని నితీశ్ కుమార్ అధికారిక నివాసం ‘నెక్ సంవాద్ కక్షా’లో జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, ఎస్పీ, ఎన్సీ తదితర పదిహేను పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు హాజరు కానున్నారు.
ఇందుకోసం గురువారం సాయంత్రానికే విపక్ష నేతలంతా పాట్నాకు చేరుకుంటారని సమాచారం. శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని, సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. తొలుత నితీశ్ కుమార్ కీలక ప్రసంగం చేస్తారు. మోదీ పాలనలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలపైన, విపక్షాలు ఐక్యతపైనా ప్రధానంగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ మాట్లాడుతారు.
హాజరయ్యే కీలక నేతలు..
నితీశ్ కుమార్ (జేడీయూ)
మల్లికార్జున్ ఖర్గే (కాంగ్రెస్)
రాహుల్ గాంధీ (కాంగ్రెస్)
మమతా బెనర్జీ (టీఎంసీ)
అర్వింద్ కేజ్రీవాల్ (ఆప్)
శరద్ పవార్ (ఎన్సీపీ)
ఉద్ధవ్ ఠాక్రే (శివసేన)
అఖిలేశ్ యాదవ్ (సమాజ్ వాదీ)
ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్)
మెహబూబా ముఫ్తీ (పీడీపీ)