Raghu Rama Krishna Raju: వైసీపీ నేతల వ్యాఖ్యలు పవన్ కే మేలు చేస్తాయి: రఘురామకృష్ణరాజు
- పవన్ పై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ కాపు నేతలు
- పవన్ పై కాపు నేతల దాడి సరికాదన్న రఘురాజు
- తమ పార్టీ పరిస్థితి దిగజారుతోందని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీలోని కాపు నేతలు విమర్శలు గుప్పిస్తుండటాన్ని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుపట్టారు. పవన్ పై కాపు నేతల దాడి సరికాదని అన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పవన్ కే మేలు చేస్తాయని చెప్పారు. ప్రజలకు మరింత చేరువ కావడానికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ యాత్రలు చేస్తున్నారని అన్నారు. తమ ముఖ్యమంత్రి జగన్ మాత్రం పరదాల చాటున ఉంటూ ప్రజలకు దూరమవుతున్నారని చెప్పారు. తమ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని అన్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదన్న పవన్ మాటల్లో తప్పేముందని రఘురాజు ప్రశ్నించారు. అలాగే 175 స్థానాలూ మనకే రావాలన్న చంద్రబాబు మాటల్లో కూడా తప్పులేదని చెప్పారు. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి జగన్ కాపు నేతలతో తిట్టించారని... అప్పుడు లేఖ రాయని ముద్రగడ పద్మనాభం ఇప్పుడు రాయడం సమంజసమేనా? అని ప్రశ్నించారు.
కాపు నేత ముద్రగడ పద్మనాభం పవన్ ను విమర్శిస్తూ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో ముద్రగడ వైసీపీకి దగ్గరవుతున్నారని, జగన్ కి ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని పలువురు విమర్శించారు. ఇదే సమయంలో పవన్ పై వైసీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసబెట్టి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే రఘురాజు స్పందిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.