KTR: సాగర్ ఫ్లైఓవర్ ప్రమాద బాధితులను పరామర్శించిన కేటీఆర్, తలసాని
- కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
- ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న మంత్రులు
- ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమని తేలితే కఠిన చర్యలన్న కేటీఆర్
సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తాలోని ఫ్లైఓవర్ నిర్మాణ పనుల సందర్భంగా ప్రమాదం చోటు చేసుకోగా, పలువురు గాయపడ్డారు. బాధితులు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పరామర్శించారు.
ప్రమాదం జరిగిన తీరును, చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పూర్తి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాఫ్తుకు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా, హైదరాబాద్ లోని సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తున్న సమయంలో అది కూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది కార్మికులు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన కార్మికులు బీహార్ వాసులుగా తెలుస్తోంది.