Ghaziabad: మహిళను హింసించి చంపిన బంధువులు.. అరుపులు వినిపించకుండా పెద్ద శబ్దంతో పాటలు
- ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘటన
- పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన మహిళపై దొంగతనం నేరారోపణ
- ఒప్పుకోవాలంటూ బ్లేడు, రాడ్డుతో చిత్రహింసలు
- చిత్రహింసలు భరించలేక మహిళ మృతి
బంగారు ఆభరణాలు దొంగిలించిందన్న అనుమానంతో 23 ఏళ్ల మహిళను స్వయంగా ఆమె బంధువులే చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపేశారు. బ్లేడుతో శరీరంపై కోస్తూ, ఇనుప రాడ్లతో ఆమెను కుళ్లబొడుస్తుంటే భరించలేని ఆమె పెడుతున్న కేకలు బయటకు వినిపించకుండా పెద్దశబ్దంతో పాటలు పెట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిందీ ఘటన. ఆమె చనిపోయిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పక్కింటి నుంచి రెండు రోజులుగా పెద్ద శబ్దంతో మ్యూజిక్ వినిపిస్తుండడంతో అనుమానించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఘజియాబాద్‌లో ఉండే బంధువులు హీనా, రమేశ్ దంపతుల తనయుడి పుట్టినరోజు వేడుక కోసం వాళ్లింటికి సమినా అనే యువతి వెళ్లింది. అదే సమయంలో వారింట్లో రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. దీంతో వారు సమీనానే వాటిని దొంగిలించిందని భావించి ఆమెను పట్టుకుని కర్రలు, రాడ్లతో చితకబాదారు.
నిజం ఒప్పుకోవాలంటూ బ్లేడుతో శరీరంపై కోస్తూ చిత్రవధ చేశారు. ఆమె అరుపులు పక్కింటి వాళ్లకు వినిపించకుండా పెద్ద శబ్దంతో పాటలు పెట్టారు. వారి టార్చర్ భరించలేని ఆమె ప్రాణాలు కోల్పోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. హడావుడిలో మ్యూజిక్ ఆఫ్ చేయడం మర్చిపోయారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.