Dwarampudi Chandrasekhar Reddy: పవన్ కల్యాణ్, ఆయన పెదనాన్న సీఎం పదవికి పోటీపడుతున్నారు: ద్వారంపూడి
- హైదరాబాద్ లోనే పవన్, చంద్రబాబు కుమ్మక్కయ్యారన్న ద్వారంపూడి
- పవన్ వ్యాఖ్యలతో కాకినాడకు చెడ్డపేరు వస్తోందని మండిపాటు
- చంద్రబాబు చెప్పారని పవన్ మాట్లాడటం సరికాదని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే తన గురించి పవన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోనే పవన్, చంద్రబాబులు కుమ్మక్కయ్యారని అన్నారు. చంద్రబాబు చెప్పారని పవన్ మాట్లాడటం సరికాదని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న కాకినాడకు చెడ్డపేరు తేవద్దని... గంజాయి, రౌడీయిజం, రైస్ అక్రమ ఎగుమతులు అంటూ అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు. పవన్ వ్యాఖ్యలతో కాకినాడకు చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు.
రైస్ ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా తమ కుటుంబం ఉందని... ఇప్పుడు తాము రైస్ మిల్లులను నిర్వహించడం లేదని, వాటిని అద్దెకు ఇచ్చేశామని ద్వారంపూడి చెప్పారు. కావాలంటే లీజ్ అగ్రిమెంట్లు చూపిస్తామని అన్నారు. రైస్ ఎక్స్ పోర్ట్ వ్యాపారంలో మాత్రం ఉన్నామని తెలిపారు. ఈ బిజినెస్ లో తాము 7వ స్థానంలో ఉన్నామని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను పవన్ చదువుతున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్, ఆయన పెదనాన్న, తమ్ముడు నారా లోకేశ్ అందరూ ఒకే విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఏపీలో ముఖ్యమంత్రి పదవి కోసం పవన్, ఆయన పెదనాన్న చంద్రబాబు పోటీ పడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు.