Prime Minister: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో మోదీ ఒకరు: న్యూయార్క్ టైమ్స్ ప్రశంసలు
- ప్రతి నెలా మన్ కీ బాత్ కార్యక్రమంతో ప్రధాని ప్రసంగం
- దీంతో ట్విట్టర్ లో ఆయనకు పెరుగుతున్న ఫాలోవర్లు
- భారత ప్రధానిపై అమెరికా పత్రికలో ప్రత్యేక కథనం
ప్రధాని మోదీని ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో ఒకరిగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఆ పత్రికలో ముజీబ్ మషాల్ ఇందుకు సంబంధించి ఓ ఆర్టికల్ రాశారు. ప్రధాని మోదీ ప్రజాదరణకు ఆయన నిర్వహిస్తున్న మన్ కీ బాత్ అనే రేడియో కార్యక్రమంతో రచయిత ముజీబ్ ముడిపెట్టారు. ప్రధాని మోదీని ట్విట్టర్ లో 8.95 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ప్రధాని మోదీకి ఇంత మంది ఫాలోవర్లు, అభిమానులు ఉండడానికి మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం తోడ్పడుతున్నట్టు ముజీబ్ విశ్లేషణగా ఉంది.
‘‘ప్రధాని మోదీకి అంత ప్రజాదరణ వెనుక ఆయన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని కావడం వల్ల కాదు. ఎన్నో దేశాలను పర్యటించడం వల్ల కూడా కాదు. ప్రజలపై ఆయన చూపించే ప్రభావం, ఆయన చేపడుతున్న విధానాలు భారతీయులపై సహజంగానే ఆయన వారసత్వాన్ని నడిపిస్తాయి’’ అని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ప్రధాని మోదీ ప్రతి నెలా ఒకసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి హిందీలో మాట్లాడుతుంటారు. 30 నిమిషాల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే ఇది 100 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. ప్రధాని ఈ కార్యక్రమం ద్వారా ఏఏ అంశాలను ప్రస్తావిస్తారనేది కూడా సదరు కథనంలో ముజీబ్ ప్రస్తావించారు.