Karnataka: కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం.. కాంగ్రెస్‌కు అనుకోని 'హిందూ'వరం
- శక్తి పథకానికి మహిళల నుండి అనూహ్య స్పందన
- పథకం ప్రారంభమైనప్పటి నుండి బస్సులు కిటకిట
- ఈ స్కీం ద్వారా ఆలయాలకు మహిళల వెల్లువ
- కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా మారిన స్కీమ్
కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఇప్పుడు ఆ పార్టీకి అనుకోని వరంలా మారింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం శక్తి స్కీమ్ కాంగ్రెస్ పార్టీకి సాఫ్ట్ హిందూ కార్డుగా కూడా మారింది. ఈ పథకం టెంపుల్ టూరిజంను ప్రోత్సహిస్తోంది.
శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రజలు, ముఖ్యంగా మహిళలు, రాష్ట్రంలోని ప్రధాన హిందూ దేవాలయాలకు గతవారం రోజులుగా తరలివస్తున్నారు. కేఎస్ఆర్టీసీ, ఎన్‌డబ్ల్యుఆర్టీసీ, కేకేఆర్టీసీ అనే మూడు ప్రభుత్వ రవాణా సంస్థలు నిర్వహించే బస్సులకు మహిళల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ స్కీమ్ కారణంగా ప్రముఖ దేవాలయ పట్టణాలకు వెళ్లే బస్సులు కిక్కిరిసి పోతున్నాయి. అంతేకాదు, వివిధ ఆలయాలను సందర్శించేందుకు బస్సులను ఉచితంగా బుక్ చేసుకోవచ్చా అని మహిళా సంఘాలు అడుగుతున్నాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
తమ పార్టీని హిందూ వ్యతిరేక పార్టీగా బీజేపీ ఆరోపిస్తోందని చెబుతూ.. శక్తి స్కీమ్ అమలు ద్వారా అసలైన హిందూ మద్దతుదారు కాంగ్రెస్ అని తేలిపోయిందని ఈ పథకం అమలును పర్యవేక్షిస్తున్న రవాణా మంత్రి రామలింగారెడ్డి అన్నారు. 'ఇతర మతాలను గౌరవిస్తూ దేవుడిని పూజించేవాడే నిజమైన హిందువు' అన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని, హిందువులను రక్షించడంతోపాటు వారి అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.
జూన్ 11న శక్తి స్కీమ్ పథకం ప్రారంభమైనప్పటి నుండి కోట్లాది మంది మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించారు. వచ్చే ఎన్నికల్లో ఇది తమకు ఓటు బ్యాంకుగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పథకం తర్వాత మహిళల నుండి వస్తున్న ఆదరణ పట్ల కాంగ్రెస్ ఆనందంగా ఉంది. అయితే ఈ పథకం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ.4,400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది.
మహిళల ఉచిత ప్రయాణం కారణంగా దేవాలయాల వద్ద రద్దీ పెరగడంతో పాటు, ధర్మస్థల, కుక్కే సుబ్రమణ్య, కొల్లూరు మూకాంబిక, కటీల్ దుర్గాపరమేశ్వరి, ఉడిపి కృష్ణ దేవాలయం, శృంగేరి, గోకర్ణ, హొరనాడు వంటి ఆలయ ప్రాంతాల్లో వ్యాపారాలు పెరిగాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ అధికారులు ప్రత్యేకంగా వారాంతాల్లో భక్తులకు అదనపు ఆహారాన్ని వండి పెట్టాల్సి వస్తోంది.