Narendra Modi: అమెరికా వైట్ హౌస్ లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం
- అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
- వైట్ హౌస్ లోకి మోదీకి స్వయంగా స్వాగతం పలికిన బైడెన్ దంపతులు
- 19 తుపాకులతో మోదీకి గౌరవ వందనం
- మోదీ-బైడెన్ సంయుక్త మీడియా సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతోంది. తాజాగా, ఆయనకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఘనస్వాగతం లభించింది. మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు స్వయంగా స్వాగతించారు. 19 తుపాకులతో సాయుధ సైనికులు మోదీకి గౌరవ వందనం సమర్పించారు.
మోదీ, బైడెన్ కాసేపట్లో ఇరు దేశాల సంబంధాలపై సంయుక్త ప్రకటన చేయనున్నారు. రక్షణ రంగం, నూతన సాంకేతికతలు, ఆరోగ్య రంగం, పర్యావరణం, వీసాలు, అత్యవసర సేవల రంగాలు తదితర అంశాల్లో పరస్పర సహకారంపై ఒప్పందాలను కూడా ఈ సమావేశంలో వెల్లడించనున్నారు.
కాగా, మోదీ వైట్ హౌస్ లో అడుగుపెట్టిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ... అమెరికా, భారత్ మధ్య బంధం 21వ శతాబ్దంలో కెల్లా అత్యంత అర్థవంతమైనదని అభివర్ణించారు. ఇరు దేశాల రాజ్యాంగాల్లోని మొదటి మాడు మాటలు 'వుయ్ ద పీపుల్' అనే ఉంటాయని, రెండు సార్వభౌమ దేశాలను కలిపి ఉంచే అంశం ఇదేనని పేర్కొన్నారు. కాగా, ద్వైపాక్షిక సమావేశం ముగిసిన అనంతరం మోదీ, బైడెన్ సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.