Titanic: వారు చనిపోయారు.. ‘టైటాన్’ కథ విషాదాంతం

Titan submersible found on ocean floor all five aboard dead

  • ఫలించని అన్వేషణ
  • విపరీతమైన పీడనం కారణంగా పేలిపోయిన టైటాన్
  • అందులోని ఐదుగురూ మరణించారన్న అమెరికన్ కోస్ట్‌గార్డ్
  • మృతుల కుటుంబాలకు సంతాపం

అట్లాంటిక్ మహాసముద్రంలో ఎప్పుడో 111 ఏళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ షిప్ శకలాలు చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలాంతర్గామి టైటాన్ కోసం చేసిన అన్వేషణ ఫలించలేదు. వారు క్షేమంగా బయటపడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. అందులోని ఐదుగురూ మరణించినట్టు అమెరికన్ కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. తీవ్ర పీడనం కారణంగా సముద్ర గర్భంలో సబ్‌మెర్సిబుల్ పేలిపోయిందని, అందులోని వారందరూ మరణించారని తెలిపింది. టైటానిక్‌కు 488 మీటర్ల  దూరంలో దాని శకలాలను గుర్తించినట్టు పేర్కొంది. ఈ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసినట్టు రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ తెలిపారు. 

 టైటానిక్ శకలాలు చూసేందుకు 'టైటాన్‌'లో వెళ్లిన ఐదుగురు చనిపోయి ఉండొచ్చని అంతకుముందు ఈ యాత్ర నిర్వహించిన ఓషన్‌గేట్ తెలిపింది. ఆ ఐదుగురు నిజమైన అన్వేషకులని, ప్రపంచ మహాసముద్రాల అన్వేషణ, రక్షణలో వీరు ఎంతో అభిరుచిని కలిగి ఉన్నారని పేర్కొంది. ఈ విషాద సమయంలో తమ ఆలోచనలు వారి కుటుంబాలతోనే ఉన్నాయని, ఈ ఘటనకు చింతిస్తున్నట్టు తెలిపింది. 

మృతుల్లో పాక్ బిలియనీర్, ఆయన కుమారుడు
సముద్ర గర్భంలో 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు గత ఆదివారం కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ నుంచి ఐదుగురు పర్యాటకులతో టైటాన్ బయలుదేరింది. ఇందులో పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్ (48), ఆయన కుమారుడు సులేమాన్ (19), యూఏఈలో ఉండే బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ మాజీ నావికాదళ అధికారి పాల్ హెన్రీ, యాత్ర నిర్వాహకుడు, ఓషన్‌గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ ఇందులో ఉన్నారు.

సముద్రంలోకి వెళ్లిన కాసేపటికే..
సముద్రంలోకి వెళ్లిన కొంతసేపటికే మదర్‌షిప్‌తో సంబంధాలు కోల్పోయి టైటాన్ గల్లంతైంది. అప్పటి నుంచి దాని కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. టైటాన్‌లో 96 గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్ నిల్వలు ఉండడం, అవి క్షణక్షణానికీ కరిగిపోతుండడంతో ఉత్కంఠ పెరిగింది. నిన్న సాయంత్రం 7.15 గంటలతో ఆక్సిజన్ నిల్వలు నిండుకోవడంతో ఆశలు గల్లంతయ్యాయి. చివరికి అది పేలిపోయినట్టు రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ గుర్తించింది. అందులోని ఐదుగురూ మృతి చెందినట్టు అమెరికన్ కోస్ట్‌గార్డ్ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా విషాదం నిండుకుంది.

  • Loading...

More Telugu News