Terrorism: ఉగ్రవాదాన్ని ఉపేక్షించేదిలేదన్న ప్రధాని మోదీ
- మానవాళి మొత్తానికి టెర్రరిజం శత్రువని వ్యాఖ్య
- అమెరికన్ కాంగ్రెస్ లో భారత ప్రధాని ప్రసంగం
- స్టాండింగ్ ఒవేషన్, చప్పట్లతో మార్మోగిన సభ
ఉగ్రవాదం.. మానవాళి మొత్తానికి శత్రువని, దీనిపై జరిపే పోరాటంలో ఎలాంటి ఉపేక్ష చూపబోమని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శుక్రవారం అమెరికా చట్ట సభలో కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. అమెరికా ప్రజా ప్రతినిధులు చప్పట్లతో మోదీకి స్వాగతం పలికారు. మోదీ.. మోదీ అన్న అరుపులతో సభ దద్దరిల్లిపోయింది. భారత సంప్రదాయం ప్రకారం సభికులకు చేతులు జోడించి నమస్కరిస్తూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉగ్రవాదంపై భారత్ ఎలాంటి ఉపేక్ష చూపదని, టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాలపైకి వదిలే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమని తేల్చిచెప్పారు.
అమెరికాలోని ట్విన్ టవర్స్ కూల్చివేత ఘటన (9/11), ముంబైలో దాడుల (26/11) ఘటనలను ప్రస్తావిస్తూ.. రాడికలిజం, టెర్రరిజం మొత్తం ప్రపంచానికి పెను ముప్పుగా మారాయని మోదీ పేర్కొన్నారు. అగ్రరాజ్యంలోని అత్యున్నత సభలో పాకిస్థాన్ ను పరోక్షంగా హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ ప్రపంచానికి ముప్పు తొలగిపోలేదని మోదీ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు లేచి నిలబడి చప్పట్లతో మోదీని అభినందించారు. కాగా, అమెరికన్ కాంగ్రెస్ లో ప్రధాని మోదీ ప్రసంగించడం ఇది రెండవసారి.