PAN Aadhaar linking: పాన్-ఆధార్ లింక్ గడువు పొడిగించే అవకాశం ఉందా?
- ఇప్పటికే ఎన్నో పర్యాయాలు గడువు పొడిగింపు
- మళ్లీ పొడిగించడం కోసం వేచి చూడొద్దని నిపుణుల సలహా
- లింక్ చేసుకోకపోతే పనిచేయని పాన్
ప్రతి ఒక్కరూ తమ పాన్ ను ఆధార్ తో లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు గడువు పొడిగిస్తూ వస్తోంది. ఈ నెల 30 వరకు గడువు ఉంది. దీని తర్వాత మరో విడత గడువు పొడిగిస్తారా? అంటే సందేహమే. కానీ, ఎక్కువ మంది గడువు పొడిగించొచ్చన్న అంచనాలతో ఉన్నారు. ఒకవేళ పొడిగించకపోతే ఏంటి? పొడిగించినా ఇప్పుడున్న రూ.1,000 జరిమానాను రెట్టింపు చేస్తే పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించి నిర్ణయించుకోవాలి.
సాధారణంగా అన్ని రకాల పెట్టుబడులకు పాన్ అవసరం. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ప్రాపర్టీ లావాదేవీలు, బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు ఇలా ఎన్నో వాటికి పాన్ కావాల్సిందే. మరి పాన్ కావాలంటే అది యాక్టివ్ గా ఉండాలి కదా. అందుకే ఈ అనుసంధానం. నిపుణులు అయితే పాన్ ఆధార్ లింక్ గడువు పొడిగించడం సరైనదన్న అభిప్రాయంతో ఉన్నారు.
‘‘పాన్-ఆధార్ అనుసంధాన గడువు జూన్ 30 వరకు ఉంది. కానీ, ఐటీఆర్ ల దాఖలు గడువు జులై 31 వరకు ఉంది. కనుక ఈ విషయంలో గందరగోళం లేకుండా గడువు పొడిగించడమే సరైనది’’ అని ఐఆర్ఎస్ మాజీ అధికారి సుజీత్ బంగార్ అభిప్రాయపడ్డారు. ఇక నీరజ్ భగత్ అండ్ కో కంపెనీ ఎండీ సీఏ రుచికా భగత్ మాట్లాడుతూ.. ‘‘ఓ వ్యక్తి పాన్, ఆధార్ లింక్ చేసుకోకపోతే పని చేయకుండా పోతుంది. దీంతో రిటర్నులు దాఖలు చేయలేరు. అందుకే గడువు లోపు అనుసంధానించుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వం తగినంత వ్యవధి ఇచ్చింది. కనుక ఇకమీదట గడువు పొగించకపోవచ్చు. గడువు పొడిగిస్తారని చూడకుండా అనుసంధానించుకోవాలి’’ అని చెప్పారు.