apple: భారత్‌లో యాపిల్ క్రెడిట్ కార్డును ప్రారంభించేందుకు సన్నాహాలు
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కీలక పాత్ర
- ఆర్బీఐతోను యాపిల్ ప్రతినిధుల భేటీ!
- కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ కోసం నిర్దిష్ట నిబంధనలు అనుసరించాలని ఆర్బీఐ సూచన
యాపిల్ సంస్థ భారత్ లో సొంత క్రెడిట్ కార్డును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్ పర్యటనలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈవో శశిధర్ జగదీశన్‌తో భేటీ సందర్భంగా క్రెడిట్ కార్డ్ లాంచింగ్ గురించి చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. భారత్‌లో తన క్రెడిట్ కార్డు ప్రారంభించేందుకు యాపిల్ కసరత్తు సాగిస్తోందని, ఈ ప్రక్రియలో కార్డు జారీ దిశగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది.
భారత్‌లో యాపిల్ కార్డు ప్రారంభించేందుకు సంప్రదింపులు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయని, నిర్దిష్టంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కూడా వార్తలు వస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈవోతో పాటు కార్డును లాంచ్ చేయడానికి.. ఇందుకు సంబంధించి అవసరమైన లాంఛనాలు, విధివిధానాలపై చర్చించేందుకు ఆర్బీఐతో యాపిల్ ప్రతినిధులు సమావేశమయ్యారని తెలుస్తోంది.
కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల కోసం నిర్దిష్ట నిబంధనలను అనుసరించాలని యాపిల్‌కు ఆర్బీఐ సూచించింది. ఈ ప్రక్రియలో ఎలాంటి రాయితీలు ఉండవని ఆర్బీఐ స్పష్టం చేసిందని ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ఆయా ప్రతినిధులు స్పందించాల్సి ఉంది.
యాపిల్ ప్రస్తుతం తన ప్రీమియం క్రెడిట్ కార్డును అమెరికాలో ఆఫర్ చేస్తోంది. గోల్డ్‌మన్ శాక్స్, మాస్టర్‌కార్డ్ భాగస్వామ్యంతో యాపిల్ ఈ కార్డును ప్రారంభించింది.