Mumbai: 36 ఏళ్లపాటు కవల సోదరుడి పిండాన్ని మోసిన వ్యక్తి.. వైద్యుల షాక్
- 20 ఏళ్ల తర్వాత అసాధారణంగా పెరిగిన పొట్ట
- ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో వైద్యుల వద్దకు
- ఆపరేషన్ చేసి పిండాన్ని బయటకు తీసిన వైద్యుడు
- ప్రతి ఐదు లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందన్న డాక్టర్
తనకు తెలియకుండానే తన కవల సోదరుడి పిండాన్ని 36 సంవత్సరాలపాటు కడుపులో మోశాడో వ్యక్తి. నాగ్‌పూర్‌కు చెందిన సంజూ భరత్ 1963లో జన్మించారు. ఆయనకు 20 ఏళ్ల వయసు వచ్చేసరికి పొట్ట అసాధారణంగా పెరగడం ప్రారంభమైంది. ‘ప్రెగ్నెంట్ మ్యాన్’ అంటూ సహచరులు హేళన చేసినా దాని వల్ల ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో పట్టించుకోలేదు. అయితే, 1999లో నాభి వద్ద ఒత్తిడిగా అనిపించడంతోపాటు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో స్థానిక వైద్యులను సంప్రదిస్తే వారు ముంబై వెళ్లి చూపించుకోమన్నారు.
తొలుత కణతి అనుకున్నారు
ముంబై డాక్టర్ అజయ్ మెహతా ఆయనను పరీక్షించి కడుపులో కణతి ఉన్నట్టు భావించి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేసి కణతిని బయటకు తీసేందుకు చేతిని పెట్టిన తనకు ఎముకలు, వెంట్రుకల వంటి భాగాలు తగలడంతో షాకైనట్టు డాక్టర్ మెహతా తెలిపారు. దానిని బయటకు తీశాక ఆశ్చర్యపోయానని, అది మానవ పిండమని పేర్కొన్నారు. తనతో పాటు జన్మించాల్సిన కవల సోదరుడు కడుపులోనే ఉండిపోయి పెరుగుతుంటాడని, దీనిని ‘పిండంలో పిండం’గా పిలుస్తుంటారని తెలిపారు. ఐదు లక్షల మందిలో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉందని డాక్టర్ మెహతా వివరించారు.