India: ఇండిగో విమానంలో మహిళకు ప్రాణాపాయం.. కాపాడిన తోటి ప్రయాణికుడు
- శుక్రవారం బెంగళూరు-ఢిల్లీ ఇండిగో విమానంలో వెలుగు చూసిన ఘటన
- మార్గమధ్యంలో ప్రయాణికురాలికి అకస్మాత్తుగా గుండెపోటు
- వెంటనే మహిళకు సీపీఆర్ చేసిన తోటి ప్రయాణికుడు
- విమానం ఢిల్లీలో దిగగానే ఆసుపత్రికి మహిళ తరలింపు
- బాధితురాలికి ప్రాణాపాయం తప్పిందని ఎయిర్‌లైన్స్ ప్రకటన
ఇండిగో విమానంలో గుండెపోటు బారినపడ్డ ఓ మహిళకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ వైద్యుడు ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాపాయాన్ని తప్పించారు. ఇండిగో 6సీ 869 విమానం శుక్రవారం బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరింది. మార్గమధ్యంలో విమానంలోని రోసమ్మ(60) అనే ప్రయాణికురాలికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో విలవిల్లాడిపోయింది.
ఈ క్రమంలో విమానంలో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ వెంటనే రంగంలోకి దిగారు. ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. విమానం ఢిల్లీలో లాండ్ అవగానే సిబ్బంది మహిళను ఆసుపత్రికి తరలించారు. తోటి ప్రయాణికుడు తక్షణం స్పందించడంతో మహిళకు ప్రాణాపాయం తప్పిందని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.