Congress: కాంగ్రెస్ తో కలిసి నడవడం కష్టమేనంటున్న ఆప్
- విపక్ష భేటీలో ఆప్ వర్సెస్ కాంగ్రెస్
- ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ వైఖరి చెప్పాలంటూ నిలదీత
- పార్లమెంట్ సమావేశాల ముందు చెప్తామన్న ఖర్గే
కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడం కష్టమేనని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది. ఢిల్లీ సర్వీసులపై కంట్రోల్ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. ఈ విషయంపై నాన్చివేత ధోరణి అవలంబించడాన్ని ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఢిల్లీ ఆర్డినెన్స్ పై క్లారిటీ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ పాల్గొనే సమావేశాలకు ఆప్ దూరంగా ఉంటుందని తేల్చిచెప్పారు. ఈమేరకు శుక్రవారం (ఈ నెల 23) పాట్నాలో జరిగిన విపక్షాల భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్షాల భేటీలో కూడా ఆప్, కాంగ్రెస్ మధ్య ఇదే విషయంపై వాదన కొనసాగిందని సమాచారం.
కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాడేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంపై చర్చల కోసం శుక్రవారం పాట్నాలోని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇంట్లో సమావేశమయ్యాయి. 15 పార్టీలకు చెందిన 30 మంది ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన కేజ్రీవాల్.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాలని కాంగ్రెస్ చీఫ్ ను కోరారు. రాజ్యసభలో ఆర్డినెన్స్ ను అడ్డుకుంటామని ప్రకటించాలని కోరారు.
అయితే, ఈ విషయంపై ఇప్పుడే చర్చించాల్సిన అవసరంలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు తమ స్టాండ్ చెబుతామని వివరించారు. దీంతో మీటింగ్ ముగిశాక మీడియా సమావేశంలో పాల్గొనకుండానే కేజ్రీవాల్, భగవంత్ మాన్ వెళ్లిపోయారు. ఆప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో ఏ రకమైన పొత్తయినా సరే కష్టమేనని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.