american Singer: ప్రధాని మోదీకి పాదాభివందనం చేసిన అమెరికన్ గాయని
- భారత జాతీయ గీతాన్ని ఆలపించిన గాయని మిల్ బెన్
- దీన్ని గౌరవంగా భావిస్తున్నట్టు ప్రకటన
- భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని తెలియజెప్పిన గాయని
ప్రముఖ అమెరికన్ గాయని మేరీ మిల్ బెన్ భారతీయ సంస్కృతికి గౌరవం ఇచ్చింది. తాను అమెరికన్ అయినప్పటికీ, భారత సంస్కృతికి అనుగుణంగా ప్రధాని మోదీ పాదాలకు నమస్కారం చేసింది. ఈ సందర్భంగా ప్రధాని గాయని చేతులను పట్టుకుని ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందు మిల్ బెన్ భారత జాతీయ గీతం జనగణ మన అంటూ ఆలపించింది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగింపునకు చిహ్నంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.
యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని వాషింగ్టన్ డీసీలోని ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ లో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భారత జాతీయ గీతాన్ని ఆలపించే అవకాశం మిల్ బెన్ కు వచ్చింది. మిల్ బెన్ (38) ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికన్. ఆమె హాలీవుడ్ నటి కూడా. తనకు ఆ అవకాశం ఇచ్చినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు అంతకుముందు మిల్ బెన్ వ్యాఖ్యానించారు.
‘‘అమెరికా, భారత జాతీయ గీతాలు రెండూ ప్రజాస్వామ్య ఆదర్శాలను, స్వేచ్ఛను తెలియజేస్తాయి. అమెరికా-భారత్ అసలైన బంధాల సారాంశం ఇది. స్వేచ్ఛాయుత దేశం అన్నది ప్రజల స్వేచ్ఛ ద్వారానే నిర్ణయించబడుతంది’’ అని మిల్ బెన్ పేర్కొన్నారు.