MLA Mustafa: నేను చెప్పినా పనులు చేయరా?: అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఆగ్రహం
- గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ముస్తఫా ఆగ్రహం
- తాను అధికార పార్టీలో లేనా? అంటూ మండిపాటు
- తాను చెప్పినా లక్ష రూపాయలతో కల్వర్టు నిర్మాణం చేయలేరా? అని ప్రశ్న
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఈ రోజు కూడా వాడీవేడిగా కొనసాగుతోంది. సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా అధికారులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను అధికార పార్టీలో లేనా? తాను చెప్పినప్పటికీ పనులు చేయరా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా తాను చెప్పినా లక్ష రూపాయలతో కల్వర్టు నిర్మాణం చేయలేరా? అని మండిపడ్డారు. తాను రెకమెండ్ చేస్తే పనులు చేయరా? అని ప్రశ్నించారు. రెండున్నరేళ్ల పాటు తాను వేచి చూశానని... ఇక వెయిట్ చేయలేనని చెప్పారు. అసిస్టెంట్ ఇంజినీర్ ను కౌన్సిల్ కు పిలిపించాలని... అప్పటి వరకు కౌన్సిల్ సమావేశాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఎన్టీఆర్ సర్కిల్ ను అభివృద్ధి చేయాలని టీడీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. గుంటూరులో అనేక సర్కిళ్లను అభివృద్ధి చేసి, ఎన్టీఆర్ సర్కిల్ ని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ... తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ ను తానే అభివృద్ధి చేస్తానని చెప్పారు. మరోవైపు వైసీపీ కాంట్రాక్టర్లు మాట్లాడుతూ, ఎన్టీఆర్ సర్కిల్ అభివృద్ధి కోసం రూ. 9 లక్షల నిధులను విడుదల చేసినప్పటికీ కాంట్రాక్టర్ పనులు చేయలేదని తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు హాల్ లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.