Wagner group: పుతిన్ పెంచి పోషించిన మనిషే తిరుగుబాటు.. ఇంతకీ ఎవరీ యెవ్జెనీ ప్రిగోజిన్‌?

mutiny in russia all about wagner chief who challenged putin hot dog seller to mercenary group

  • నిన్నటిదాకా రష్యా తరఫున ఉక్రెయిన్‌లో వాగ్నర్ గ్రూప్ యుద్ధం
  • ఇప్పుడు రష్యా సైన్యంపైనే తిరుగుబావుటా ఎగురవేసిన ప్రిగోజిన్‌
  • పుతిన్, ప్రిగోజిన్‌ ఇద్దరిదీ ఒకే ప్రాంతం..  1990ల్లో వీరికి పరిచయం
  • పుతిన్ అధ్యక్షుడయ్యాక ఎదురులేని వ్యక్తిగా ఎదిగిన ప్రిగోజిన్
  • ‘పుతిన్‌ షెఫ్‌’గా, ఆంతరంగికుల్లో ఒకరిగా పేరు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెంచి పోషించిన వ్యక్తే ఇప్పుడు ఎదురుతిరిగాడు. నిన్న మొన్నటి దాకా రష్యా సైన్యం కోసం పని చేసి.. ఇప్పుడు అదే సైన్యంపైనే తిరుగుబావుటా ఎగురవేశాడు. సైనిక నాయకత్వాన్ని కూలదోస్తామని ప్రతిన బూనాడు. ఇంతకీ అతడెవరు? 

ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి వాగ్నర్‌ కిరాయి సైన్యం రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగింది. వాగ్నర్ గ్రూప్‌ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్‌. ముందు దొంగ.. తర్వాత చెఫ్.. ఆ తర్వాత ఏకంగా ఓ ప్రైవేటు సైన్యాన్ని నడిపే వ్యక్తిగా ఎదిగారు. పుతిన్‌ పొలిటికల్‌ సర్కిల్‌లో యెవ్జెనీ ప్రిగోజిన్‌ అంటే తెలియని వారుండరు. ఆయన్ను ‘పుతిన్‌ షెఫ్‌’గా వ్యవహరిస్తుంటారు. పుతిన్‌ ఆంతరంగికుల్లో ప్రిగోజిన్‌ ఒకరు.

1961లో జన్మించిన ప్రిగోజిన్.. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. 1990ల్లో పుతిన్, ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరిదీ సెయింట్ పీటర్స్‌బర్గ్‌నే కావడం గమనార్హం. 2000లో పుతిన్‌ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు ప్రిగోజిన్‌ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించాడు. 2001 నుంచి పుతిన్‌ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్‌ కనిపిస్తూనే ఉన్నాడు.

రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్‌ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్‌ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్‌ పాత్ర బయటకు వచ్చింది. క్రిమియా ఆక్రమణలో ‘లిటిల్‌ గ్రీన్‌మ్యాన్‌’ రూపంలో వాగ్నర్‌ గ్రూప్‌ హస్తం కూడా ఉంది. 2016లో ప్రిగోజిన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఎఫ్‌బీఐ ఇతడిపై 2,50,000 డాలర్ల రివార్డు ప్రకటించింది.

వాగ్నర్‌ పీఎంసీ రష్యా ప్రైవేటు సైన్యం. వాస్తవానికి ఈ పేరుతో ఏ కంపెనీ రిజిస్టరై లేదు. రష్యా సైన్యానికి చెందిన మాజీ లెఫ్టినెంట్‌ కర్నల్‌ దిమిత్రి ఉత్కిన్‌ ప్రారంభించాడు. జర్మనీ నియంతకు ఇష్టమైన ఒపేరా కంపోజర్‌ వాగ్నర్‌ పేరిట దీనిని ప్రారంభించినట్లు చెబుతారు. 

వాగ్నర్‌ బృందంలో అత్యధికంగా మాజీ సైనికులే ఉంటారు. వీరికి కొన్ని సందర్భాల్లో సాధారణ రష్యా సైనికుడికంటే చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి. వీరు మరణిస్తే కుటుంబానికి దాదాపు 50 వేల డాలర్ల వరకు చెల్లిస్తారు. 2017లో బ్లూమ్‌బెర్గ్‌ లెక్క ప్రకారం ఈ గ్రూపులో 6,000 మంది ఉన్నారు.

ప్రపంచంలోని పలు దేశాల్లో వాగ్నర్‌ గ్రూప్‌ కదలికలు ఉన్నాయి. లిబియా సివిల్‌ వార్‌, సిరియా, మోజాంబిక్‌, మాలి, సుడాన్‌, ది సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, వెనుజువెలా వంటి దేశాల్లో వాగ్నర్‌ గ్రూప్‌ ఉంది. ముఖ్యంగా సిరియాలో రష్యా అనుకూల బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వాన్ని కాపాడటంలో వాగ్నర్‌ గ్రూప్‌.. రష్యా సైన్యంతో కలిసి పనిచేసింది.

మొన్నటిదాకా ఉక్రెయిన్‌లోనూ రష్యాకు అండగా వాగ్నర్ గ్రూప్ పోరాడింది. కానీ ఇప్పుడు రష్యాకు వ్యతిరేకంగా ముందుకు సాగుతోది. దీంతో రష్యాలో అంతర్యుద్ధం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News