Roberto Lopez Rodriguez: హైహీల్స్ వేసుకుని 100 మీ పరుగులో గిన్నిస్ రికార్డు సాధించిన వ్యక్తి
- స్పెయిన్ వ్యక్తి గిన్నిస్ రికార్డు
- హైహీల్స్ వేసుకుని 12.82 సెకన్లలో 100 మీ పూర్తి
- గతంలో జర్మనీ వ్యక్తి పేరిట రికార్డు
హైహీల్స్ వేసుకుంటే నడవడమే కష్టమవుతుంది. అలాంటిది ఓ వ్యక్తి హైహీల్స్ వేసుకుని 100 మీటర్ల పరుగులో వరల్డ్ రికార్డు బద్దలు కొట్టాడు. సాధారణంగా, హైహీల్స్ వేసుకుని పరిగెత్తితే పాదాలు, కాళ్లు, నడుం, తుంటి భాగం గాయపడే అవకాశం ఉంది. కానీ స్పెయిన్ కు చెందిన రాబర్టో లోపెజ్ రోడ్రిడ్వెజ్ అనే వ్యక్తి మాత్రం ఇవేవీ లెక్కచేయకుండా హైహీల్స్ వేసుకుని రివ్వున దూసుకుపోయాడు.
34 ఏళ్ల రోడ్రిగ్వెజ్ 100 మీటర్ల పరుగును 12.82 సెకన్లలో పూర్తి చేశాడు. గతంలో హైహీల్స్ వేసుకుని అత్యంత తక్కువ సమయంలో 100 మీటర్ల పరుగు పూర్తి చేసిన రికార్డు జర్మనీకి చెందిన వ్యక్తి ఖాతాలో ఉంది. ఆ వ్యక్తి 14.02 సెకన్లలో పూర్తి చేయగా, తాజాగా స్పెయిన్ వీరుడు రోడ్రిగ్వెజ్ అంతకంటే తక్కువ సమయంలోనే రేస్ ఫినిష్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాడు.
ఈ క్రమంలో రోడ్రిగ్వెజ్ నమోదు చేసిన సమయంలో ప్రఖ్యాత స్ప్రింట్ వీరుడు ఉసేన్ బోల్ట్ వరల్డ్ రికార్డు టైమింగ్ కు 3.24 సెకన్ల దూరంలో నిలిచాడు. బోల్ట్ 100 మీటర్ల పరుగును 9.58 సెకన్లలోనే పూర్తి చేసిన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది.