TDP: జగన్ కాపుల గొంతు కోసినా నోరెందుకు మెదపడం లేదు.. కాపు మంత్రులపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని ఫైర్
- జగన్ నాలుగేళ్ల పాలనలో కాపులకు బోల్డంత అన్యాయం జరిగిందన్న అనగాని సత్యప్రసాద్
- కాపు రిజర్వేషన్‌ను రద్దు చేసి వారి గొంతు కోశారని ఆగ్రహం
- వచ్చే ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పాలని పిలుపు
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లోని కాపు మంత్రులపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నాలుగేళ్ల జగన్ పాలనలో కాపులకు జరిగినంత అన్యాయం గత 40 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్ తీసుకొస్తే జగన్ రద్దు చేసి కాపుల గొంతు కోశారని మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ ద్వారా కాపు యువతకు అందాల్సిన రూ. 45 వేల రుణాలను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు ఇంత మోసం జరుగుతున్నా కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో మీ నోళ్లకు తాళాలు వేసుకున్నారా? అని ప్రశ్నించారు.
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించి టీడీపీ భరోసా ఇచ్చిందన్నారు. కేంద్రం ప్రకటించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5 శాతం ఆర్థికంగా వెనుకబడిన కాపులకు కేటాయించిన ఘనత తమదేనని అన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా రూ.3,100 కోట్ల నిధులను కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేసినట్టు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పదవిని కాపులకు ఇచ్చామని, ప్రతి జిల్లాలో రూ.5 కోట్ల వ్యయంతో కాపు భవన్లను నిర్మాణం చేపడితే జగన్ వాటిని నిలిపివేయించారని ఆరోపించారు. జగన్ చేసిన మోసాన్ని కాపు సోదరులు గుర్తించి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సత్యప్రసాద్ కోరారు.