America: కిడ్నాప్ అయ్యాననుకుని.. ఉబర్ డ్రైవర్‌పై కాల్పులు జరిపిన మహిళ
- అమెరికాలోని టెక్సాస్‌లో ఘటన
- బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు టెక్సాస్ వచ్చిన 48 ఏళ్ల మహిళ
- ఉబర్ డ్రైవర్ తనను మెక్సికో తీసుకెళ్లిపోతున్నాడని అనుమానించి కాల్పులు
కిడ్నాప్ అయ్యాననుకుని భావించిన ఓ మహిళ ఉబర్ డ్రైవర్‌పై కాల్పులు జరిపింది. అమెరికాలో జరిగిందీ ఘటన. ఈ నెల 16న 48 ఏళ్ల టెక్సాస్ మహిళ ఫోబే కోపాస్ ఉబర్ ట్యాక్సీలో ప్రయణిస్తుండగా తాను కిడ్నాప్ అయ్యానేమోనన్న అనుమానం కలిగింది. తనను మెక్సికో తీసుకెళ్లిపోతున్నాడని భ్రమ పడింది. ఆ వెంటనే మరేం ఆలోచించకుండా తుపాకితో కాల్పులు జరిపింది.
పోలీసులు ఆమెపై నేరపూరిత దాడికి పాల్పడిన అభియోగాలు నమోదు చేశారు. 1.5 మిలియన్ డాలర్ల బాండ్‌పై విడుదల చేశారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్‌కు బుధవారం లైఫ్ సపోర్ట్ తొలగించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. కెంటకీకి చెందిన నిందితురాలు కోపాస్ టెక్సాస్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు వచ్చారు. స్థానిక కేసినో వద్దనున్న తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు ఉబెర్ ట్యాక్సీ ఎక్కారు.
కారు హైవే మీదుగా వెళ్తుండంతో తాను కిడ్నాప్ అయ్యానని, డ్రైవర్ తనను మెక్సికో తీసుకెళ్లిపోతున్నాడని భావించి 52 ఏళ్ల డ్రైవర్ డేనియల్ పీడ్రా గార్సియాపై కాల్పులు జరిపింది. దీంతో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. అంతకుముందు ప్రమాదం ఫొటోను ఫొటోలు తీసి తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపింది. ఈ ఘటనపై ఉబర్ ఆందోళన వ్యక్తం చేసింది. రైడర్లు ప్రమాదకరంగా మారుతున్నారని పేర్కొంది.