Ambati Rambabu: రాజారెడ్డి ఏమైనా విలనా? వంద రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్: ఏపీ మంత్రి అంబటి వ్యాఖ్య
- టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు కౌంటర్
- ఒకప్పుడు లక్ష్మీనారాయణ జగన్ ప్రాపకం కోసం ప్రయత్నించారని వ్యాఖ్య
- బీజేపీ ఇచ్చిన ఎన్నికల సొమ్ము తినేశారని ఆరోపణ
- తనను, జగన్‌ను విమర్శించే నైతిక అర్హత కన్నాకు లేదని వ్యాఖ్య
- ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోనని వార్నింగ్
వంద మంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్‌మోహన్ రెడ్డి అవుతారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ‘‘రాజారెడ్డి ఏమైనా విలనా? ఆయన రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డిని అందించారు’’ అని అన్నారు. టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన విమర్శలపై మంత్రి అంబటి ఈ మేరకు స్పందించారు. ఆదివారం ఆయన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విలేకరులతో ముచ్చటించారు.
‘‘జగన్ గురించి ముందే తెలిసిన కన్నా ఆయన ప్రాపకం కోసం 500 కార్లతో ర్యాలీగా బయల్దేరి, చివరకు గుండెనొప్పి వచ్చిందంటూ ఎందుకు నాటకాలాడారో చెప్పాలి. భాజపా ఎన్నికల డబ్బు తినేసిన కన్నాకు నన్ను, ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక అర్హత లేదు. ఆయన సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారో చివరకు పారిపోతారో తెలియదు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడినా ఊరుకోడానికి నేనేమీ చంద్రబాబును కాను. వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడిని. నేను పుట్టింది రేపల్లెలో..చచ్చేది సత్తెనపల్లిలో’’ అని అంబటి చెప్పారు.