Tamilnadu: వీధి కుక్క కోసం సొంత కుటుంబాన్ని దూరం పెట్టిన వ్యక్తి!
- తమిళనాడులోని తిరునిండ్రవూర్‌లో వెలుగు చూసిన ఘటన
- వీధి కుక్కను ప్రాణప్రదంగా పెంచుకుంటున్న సుందర్
- కుక్కను గెంటేయాలంటూ సుందర్‌కు కుటుంసభ్యుల అల్టిమేటమ్
- ఇది నచ్చక ఇంటి నుంచి బయటకు వచ్చేసిన సుందర్
- తొమ్మిదేళ్లుగా కుటుంబానికి దూరంగా కుక్కతో కలిసి ఉంటున్న వైనం
తనంటే అమితమైన విశ్వాసం చూపించే పెంపుడు కుక్క అంటే ఆ వ్యక్తికి ప్రాణం. కానీ, కుటుంబసభ్యులు మాత్రం కుక్కను ఇంట్లోంచి గెంటేయాలని అల్టిమేటమ్ ఇచ్చారు. ఇది నచ్చని ఆ వ్యక్తి తన కుక్కను తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు. పెంపుడు కుక్క కోసం సొంత కుటుంబాన్నే కాదనుకున్నాడు. తమిళనాడులో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే, సుందర్ అనే వ్యక్తి తిరునిండ్రవూర్ సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఏడాది వయసుండగా దానిని వీధిలోంచి తెచ్చుకుని, దానికి 'బ్లాకీ' అని పేరుపెట్టుకుని పెంచుకోవడం ప్రారంభించాడు. ఇక బ్లాకీకి కూడా యజమాని అంటే మాటల్లో చెప్పలేనంత విశ్వాసం. సుందర్ చేతితో పెడితేనే అది ఆహారం తింటుంది.
ఇక బ్లాకీ అంటే సుందర్‌కు కూడా అంతే అభిమానం. కానీ, కుటుంబసభ్యులు దాన్ని గెంటేయమని చెప్పడం అతడికి నచ్చలేదు. దీంతో, అతడు కుక్కను తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తొమ్మిదేళ్ల నుంచి అతడు తన కుటుంబానికి దూరంగానే గడుపుతున్నాడు. అదే నా లోకం అని స్పష్టం చేశాడు సుందర్!