Etela Rajender: నడ్డా సభకు ఈటల, కోమటిరెడ్డి దూరం.. బీజేపీకి గుడ్‌బై ఖాయమేనా?
- కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఈటల, కోమటిరెడ్డి
- కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధమైనట్టు సమాచారం
- ‘బండి’ తీరుతోనే నేతలు పార్టీ వీడుతున్నారని విమర్శలు
- కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్న నేతలు
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న నేతలిద్దరూ నిన్న నాగర్ కర్నూలులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్న సభకు గైర్హాజరు కావడం ఇందుకు ఊతమిస్తోంది. శనివారం కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో భేటీ తర్వాత ఇద్దరూ పార్టీని వదిలేయాలని కచ్చితమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీ నిర్వహించిన ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమానికి వీరిద్దరూ డుమ్మా కొట్టినప్పటి నుంచే అనుమానాలు పెరగ్గా ఇప్పుడు మరింత బలపడ్డాయి.
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తీరు కూడా పార్టీకి నేతలు దూరమవడానికి కారణంగా చెబుతున్నారు. అందరినీ కలుపుకెళ్లకుండా ఒంటెద్దు పోకడలకు పోతున్నారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నేతలు పార్టీని వీడడం ఖాయమని చెబుతున్నారు. పొంగులేటి, జూపల్లి ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం సిద్ధం కాగా, ఇప్పుడు ఈటల, కోమటిరెడ్డి, జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వంటి బీజేపీ అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.