Sunil Gavaskar: ధోనీ కాదట.. ‘ఒరిజినల్’ కెప్టెన్ కూల్ ఎవరో చెప్పిన గవాస్కర్!
- అసలైన కూల్ కెప్టెన్ కపిల్ దేవేనన్న గవాస్కర్
- ఫార్మాట్‌కు అనుగుణంగా కపిల్ కెప్టెన్సీ డైనమిక్‌గా ఉండేదని వ్యాఖ్య
- జట్టు సభ్యులపై కోప్పడకుండా చిరునవ్వుతో ఉండేవాడని వెల్లడి
ఇండియన్ క్రికెట్లో ‘కెప్టెన్ కూల్’ అంటే గుర్తొచ్చేది మహేంద్ర సింగ్ ధోనీనే. మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ఉంటూ జట్టును ముందుండి నడిపిస్తాడని పేరు పొందాడు. అయితే టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం.. అసలైన మిస్టర్ కూల్ ఎవరో చెప్పుకొచ్చాడు.
సరిగ్గా 40 ఏళ్ల కిందట టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్..‘ఒరిజినల్ కెప్టెన్ కూల్’ అని గవాస్కర్ అన్నాడు. ‘‘1983 ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్ బ్యాటింగ్‌లో రాణించడంతోపాటు బంతితోనూ అదరగొట్టాడు. వెస్టిండీస్‌తో ఫైనల్లో అతడు వివియన్ రిచర్డ్స్ క్యాచ్‌ను అందుకున్న సంగతిని మర్చిపోకూడదు” అని చెప్పాడు.
ఫార్మాట్‌కు అవసరమైన విధంగా కపిల్‌దేవ్ కెప్టెన్సీ డైనమిక్‌గా ఉండేదని గవాస్కర్ గుర్తు చేసుకున్నారు. ‘‘ఎవరైనా క్యాచ్‌ను వదిలేసినా లేదా మిస్ ఫీల్డ్ చేసినా కోప్పడకుండా చిరునవ్వుతో ఉండేవాడు. ఈ విధానమే అతడిని ‘ఒరిజినల్ (అసలైన) కెప్టెన్ కూల్’గా చేసింది’’ అని పేర్కొన్నాడు.
1983 ప్రపంచకప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. కపిల్ సారథ్యంలో చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్ అటు కెప్టెన్‌గా.. ఇటు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
జూన్ 25న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విధ్వంసక బ్యాట్స్‌మన్ వివియన్ రిచర్డ్స్ (33; 28 బంతుల్లో 7 ఫోర్లు) మదన్‌లాల్ బౌలింగ్‌లో కపిల్‌దేవ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. విజయానికి బాటలుపరిచాడు. టీమిండియాను తొలిసారి విశ్వవిజేతగా నిలిపాడు. 28 ఏళ్ల తర్వాత మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో 2011లో భారత్ రెండోసారి చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.