ysr law nestham: ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు.. మీ నుంచి ఆశిస్తున్నది అదే: సీఎం జగన్
- ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులను విడుదల చేసిన జగన్
- 2,677 మంది జూనియర్ అడ్వకేట్స్ ఖాతాల్లో రూ.6.12 కోట్లు జమ
- ఏపీలో మాత్రమే ఇలాంటి పథకం ఉందని వ్యాఖ్య
‘వైఎస్సార్ లా నేస్తం’ పథకం నిధులను ఏపీ సీఎం జగన్ ఈరోజు విడుదల చేశారు. 2,677 మంది జూనియర్ అడ్వకేట్స్కు రూ.6.12 కోట్లను వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా వైఎస్సార్ లా నేస్తం అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
లా కోర్సు పూర్తి చేసిన వారు ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందని, వారికి తోడుగా నిలిచేందుకు వైఎస్సార్ లా నేస్తం తీసుకొచ్చామని చెప్పారు. వారికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున ఏడాదిలో రూ.60 వేలు ఇస్తున్నామని చెప్పారు. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.8 లక్షలు ఇస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి దాకా 5,781 మందికి మేలు చేశామని, మొత్తంగా రూ.41.52 కోట్లు జూనియర్ లాయర్లకు ఇచ్చామని చెప్పారు. ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదని జగన్ అన్నారు. కేవలం ఏపీలో మాత్రమే ఇలాంటి పథకాన్ని చూస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వం తరఫు నుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటేనని జగన్ అన్నారు. ‘‘జూనియర్లుగా ఉన్న న్యాయవాదులకు ఈ పథకం వల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం పేదలపట్ల చూపిస్తారని నమ్ముతున్నా. ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గర నుంచి ఆశిస్తున్నది ఇదే. దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని కోరుతున్నా” అని చెప్పారు.
2023–24 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత ‘వైఎస్సార్ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని బటన్ నొక్కి జగన్ విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు (5 నెలలు) రూ.25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ కానున్నాయి.