Bhanuprakash Reddy: పింక్ డైమండ్, నేలమాళిగలు అంటూ గతంలో కూడా తప్పుడు ప్రచారం చేశారు: భానుప్రకాశ్ రెడ్డి
- శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకతవకలు జరగడం లేదన్న భానుప్రకాశ్ రెడ్డి
- భక్తుల్లో అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని వ్యాఖ్య
- శ్రీవాణి ట్రస్టుకు వస్తున్న విరాళాల వివరాలను ప్రతి నెలా ప్రకటించాలని డిమాండ్
టీటీడీకి చెందిన శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. ట్రస్టుపై అవగాహన లేకే కొందరు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారని, పింక్ డైమండ్, నేలమాళిగలు అంటూ అనవసర రాద్ధాంతం చేశారని అన్నారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలేనని అప్పుడు కూడా ఖండించానని చెప్పారు.
భక్తుల్లో నెలకొన్న అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని అన్నారు. శ్రీవాణి ట్రస్టుకు ఎన్ని విరాళాలు వస్తున్నాయో ప్రతి నెలా 1వ తేదీన టీటీడీ ప్రకటించాలని కోరారు. పింక్ డైమండ్ పై పరువునష్టం దావా కేసులో రూ. 2 కోట్ల భక్తుల డబ్బును కోర్టుకు చెల్లించారని... ఆ సొమ్మును టీటీడీ పాలకమండలి, అధికారులు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు.