america: భారత్‌ను విమర్శించేందుకు నీ శక్తిని ఖర్చు చేయకు: ఒబామాకు జానీమూరే హితవు
- భారతీయ ముస్లింల హక్కులపై ఒబామా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మూరే
- భారత్ ను విమర్శించడం కంటే ఆ దేశాన్ని పొగడడానికే తన శక్తిని వెచ్చించాలని సూచన
- ఒబామా ప్రధాని మోదీని అభినందించకుండా ఉండలేకపోయారని వ్యాఖ్య
భారతీయ ముస్లింల హక్కుల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలపై ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యూఎస్ కమిషన్ మాజీ కమిషనర్ జానీ మూరే సోమవారం స్పందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భారత్ ను విమర్శించడం కంటే ఆ దేశాన్ని పొగడడానికే తన శక్తిని వెచ్చించాలని సలహా ఇచ్చారు.
'మాజీ అధ్యక్షుడు ఒబామా భారతదేశాన్ని విమర్శించడం కంటే భారతదేశాన్ని మెచ్చుకోవడానికే ఎక్కువ శక్తిని వెచ్చించాలని నేను భావిస్తున్నాను. భారతదేశం మానవ చరిత్రలో అత్యంత వైవిధ్యమైన దేశం' అని జానీ మూర్ అన్నారు.
అమెరికా పరిపూర్ణ దేశం కానట్లే భారత్ కూడా పరిపూర్ణ దేశం కాదని, దాని వైవిధ్యమే దాని బలం అన్నారు. ఒబామా ప్రధాని మోదీని అభినందించకుండా ఉండలేకపోయారన్నారు.
ఇంతకీ.. ఒబామా ఏం చెప్పారు?
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాషింగ్టన్ డీసీలో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించిన అనంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ... మోదీతో సంభాషిస్తే భారతదేశంలోని జాతి మైనారిటీల హక్కుల గురించి చర్చిస్తానని, వారి హక్కులను సంరక్షించకుంటే ఏం జరుగుతుందో చెబుతానని అన్నారు. మైనార్టీ హక్కులను రక్షించకపోతే విడిపోవడానికి బలమైన అవకాశం ఉందనేది తన వాదన అన్నారు. ఈవ్యాఖ్యలపైనే జానీ మూర్ స్పందించారు.