koushik reddy: అది ఫేక్ వీడియో అంటూ ముదిరాజ్ సోదరులకు పాడి కౌశిక్ రెడ్డి వివరణ
- హుజూరాబాద్ లో తనకు వస్తున్న ఆదరణ ఓర్వలేక అసత్య ప్రచారమని ఆవేదన
- తనకు కుల వ్యత్యాసాలు లేవని వెల్లడి
- ఫేక్ ఆడియో ద్వారా బీఆర్ఎస్ కు ముదిరాజ్ లను దూరం చేయాలనే కుట్ర
హుజూరాబాద్ నియోజకవర్గంలో తనకు వస్తోన్న ఆదరణను చూసి తట్టుకోలేకే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ విప్ పాడి కౌశిక్ రెడ్డి సోమవారం ఆరోపించారు. తన పేరుతో ఫేక్ ఆడియోను సృష్టించారన్నారు. ఈ ఫేక్ ఆడియో ద్వారా ముదిరాజ్ ల మనోభావాలు దెబ్బతింటే, ప్రత్యేకించి హుజురాబాద్ ముదిరాజ్ సోదరులను క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. తెలంగాణ ముదిరాజ్ సామాజిక వర్గానికి వాస్తవాలు తెలియాల్సి ఉందన్నారు. తనకు కుల వ్యత్యాసాలు ఏమీ లేవని, అన్ని కులాలు సమానమేనన్నారు.
అన్ని కులాల వారిపై తనకు గౌరవం ఉందని, ఈ విషయం హుజూరాబాద్ నియోజకవర్గంలో అందరికీ తెలుసని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ముదిరాజ్ సోదరులకు దూరం చేయాలనే కుట్రలో భాగంగా తన పేరుతో ఒక ఫేక్ ఆడియోను సృష్టించారని ఆరోపించారు. అంతేకాకుండా తానొక కెమెరామెన్ ను కిడ్నాప్ చేశానని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. సదరు కెమెరామెన్ తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లిపోయాడన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు అందరి ముందు పెట్టానన్నారు.
అందులో కెమెరాన్మెన్ వెళ్లేటప్పుడు ఒక చెక్కు దొంగతనం చేసి వెళ్లడం కనిపిస్తోందని, అంతేకానీ తాను కిడ్నాప్ చేయలేదన్నారు. తనపై ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇందులో భాగంగా ఫేక్ ఆడియో తీసుకు వచ్చారన్నారు. ఈ ఫేక్ వీడియోపై డీజీపీని కలిసి, తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలన్నారు. అప్పుడే అసలు దోషులెవరో తెలుస్తుందన్నారు.