government: తెలంగాణకు రూ.2,102 కోట్ల నిధులు, ఆ జాబితాలో లేని ఆంధ్రప్రదేశ్!
- 16 రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద రూ.56,415 కోట్ల నిధుల విడుదల
- బడ్జెట్ లో ప్రతిపాదించిన ప్రత్యేక సాయం పథకం కింద ఈ నిధుల కేటాయింపు
- యాభై ఏళ్లకు గాను వడ్డీ లేని రుణంగా రాష్ట్రాలకు ఈ మొత్తం
పదహారు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మూలధన పెట్టుబడి కింద రూ.56,415 కోట్ల నిధులను విడుదల చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. బడ్జెట్ లో ప్రతిపాదించిన ప్రత్యేక సాయం పథకం కింద ఈ నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా తెలంగాణకు రూ.2,102 కోట్లు కేటాయించగా, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు జాబితాలో చోటు దక్కలేదు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట ప్రత్యేక పథకాన్ని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్ లో తీసుకువచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.3 లక్షల కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. యాభై ఏళ్లకు గాను వడ్డీ లేని రుణంగా ఈ మొత్తం రాష్ట్రాలకు వస్తుంది.
ఇందులో భాగంగా రూ.56,415 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ నిధులను విద్య, వైద్యం, నీటి పారుదల, మంచి నీటి సరఫరా, విద్యుత్, రోడ్ల నిర్మాణం కోసం వినియోగించవచ్చు. ఈ పథకం కింద ప్రస్తుతానికి నిధులు రానున్న రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు కూడా ఉన్నాయి. ఇక నిధుల కేటాయింపు విషయానికి వస్తే బీహార్ కు అత్యధికంగా రూ.9,640 కోట్లు మంజూరు చేసింది.