Narendra Modi: మోదీకి 25 ఎకరాల భూమి రాసిస్తా.. వందేళ్ల బామ్మ ప్రకటన
- మోదీ తన 15వ కుమారుడిలాంటివాడన్న బామ్మ
- ఆయన ఈ దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని ప్రశంస
- వీలైతే స్వయంగా కలవాలని ఉందన్న వృద్ధురాలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీని తన 15వ కుమారుడిలా భావిస్తానని, ఆయనకు 25 ఎకరాల భూమిని రాసిస్తానని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన మంగీబాయి తన్వర్ ప్రకటించారు. రాజ్‌గఢ్ జిల్లా హరిపుర గ్రామానికి చెందిన ఈ వందేళ్ల బామ్మకు 14 మంది సంతానం. తాజాగా, ఆమె మాట్లాడుతూ.. మోదీ ఈ దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, తనతోపాటు దేశంలోని ఎందరో వృద్ధుల అవసరాలు తీరుస్తున్నారని ప్రశంసించారు.
అందుకే మోదీని తన 15వ కుమారుడిగా భావిస్తానని చెప్పుకొచ్చారు. తనకున్న 25 ఎకరాల భూమిని మోదీ పేరున రాసి ఇస్తానని పేర్కొన్నారు. మోదీ తనకు ఇల్లు ఇచ్చి, ఉచిత వైద్యం అందించి, వితంతు పింఛన్ ఇస్తున్నారని, ఆయన వల్లే తాను తీర్థయాత్రలకు వెళ్లగలిగానని, అందుకే ఆయనను తన కుమారుడిలా భావిస్తున్నట్టు చెప్పారు. అవకాశం ఉంటే ఆయనను స్వయంగా కలుస్తానని మంగీబాయి తన మనసులో మాటను బయటపెట్టారు.