KCR: సోలిపేట రామచంద్రారెడ్డి నాలాంటి ఎందరికో స్ఫూర్తిదాయకం: కేసీఆర్
- రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట కన్నుమూత
- ఆయన వయసు 92 సంవత్సరాలు
- సంతాపం ప్రకటించిన కేసీఆర్, హరీశ్ రావు
రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. 70 ఏళ్ల పాటు రాజకీయాల్లో మచ్చ లేని నేతగా పేరుగాంచారు. ఆయన స్వస్థలం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామం. తొలితరం కమ్యూనిస్టుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. దుబ్బాక (గతలో దొమ్మాట) ఎమ్మెల్యేగా చేశారు. కాంగ్రెస్, టీడీపీ, లోక్ సత్తా పార్టీలలో పని చేశారు. కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సి.నారాయణరెడ్డి చిన్న కుమార్తెను రామచంద్రారెడ్డి పెద్ద కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు.
రామచంద్రారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. "తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట జీవితం ఆదర్శవంతమైనది. తన రాజకీయ జీవితంలో సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం రేపటి తరానికి స్ఫూర్తిదాయకం. సిద్దిపేట ప్రాంత వాసిగా, రాజకీయ, సామాజిక రంగాల్లో వారు ఆచరించిన కార్యాచరణ, ప్రజా జీవితంలో కొనసాగుతున్న తమ లాంటి ఎందరో నేతలకు ప్రేరణగా నిలిచింది. సోలిపేట రామచంద్రారెడ్డి గారి మరణంతో తెలంగాణ మరో తొలి తరం ప్రజానేతను కోల్పోయింది" అని ట్వీట్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి హరీశ్ రావు కూడా సంతాపాన్ని ప్రకటించారు.