Bombay Highi Court: అత్యాచార బాధిత బాలిక 28 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు బాంబే హైకోర్టు నిరాకరణ
- ఫిబ్రవరిలో అదృశ్యమై మూడు నెలల తర్వాత దొరికిన బాలిక
- అత్యాచారం నేపథ్యంలో గర్భం
- ఈ సమయంలో అబార్షన్ చేసినా బిడ్డ పుడుతుందన్న వైద్యులు
- బిడ్డ సహజంగా జన్మిస్తే దత్తతకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న కోర్టు
15 ఏళ్ల అత్యాచార బాధిత బాలిక 28 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు బాంబే హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈ సమయంలో బలవంతంగా అబార్షన్ చేసినా బేబీ జన్మిస్తుందన్న వైద్యుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌లు ఆర్వీ ఘూగ్, వైజీ ఖోబ్రాగడేలతో కూడిన డివిజన్ బెంచ్ అబార్షన్‌కు నిరాకరించింది.
ఫిబ్రవరిలో అదృశ్యమైన తన కుమార్తె మూడు నెలల తర్వాత రాజస్థాన్‌లో దొరికిందని, యువకుడు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిందని బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాలికకు ఇప్పుడు బలవంతంగా అబార్షన్ చేస్తే బేబీ జన్మిస్తుందని, ఫలితంగా తల్లీబిడ్డల ఇద్దరి ఆరోగ్యం రిస్కులో పడుతుందని వైద్యులు కోర్టుకు తెలిపారు.
మరో 12 వారాల్లో బాలిక సహజ ప్రసవం కానున్న నేపథ్యంలో ఆమె శారీరక, మానసిక వికాసాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. గర్భంలోని శిశువు సంపూర్ణంగా అభివృద్ధి చెంది సహజంగా ప్రసవిస్తే ఎలాంటి వైకల్యం ఉండదని, అప్పుడు ఎవరైనా దత్తత తీసుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని కోర్టు పేర్కొంది.
అయితే అప్పటి వరకు తన కుమార్తెను ఏదైనా ఎన్జీవోలో కానీ, ఆసుపత్రి పర్యవేక్షణలో కానీ ఉంచాలన్న బాలిక తల్లి కోరికపై స్పందించిన న్యాయస్థానం.. గర్భిణులను సంరక్షించే నాసిక్ షెల్టర్ హోంలో కానీ, లేదంటే ఔరంగాబాద్ ప్రభుత్వ షెల్టర్ హోంలో కానీ ఉంచవచ్చని పేర్కొంది. ప్రసవం తర్వాత బిడ్డను తనే పెంచుకోవాలా? లేదంటే దత్తత ఇవ్వాలా? అన్నది బాలిక నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.