Dasharath: నా లైఫ్ లో నాకు బాధకలిగించే విషయం అదొక్కటే: కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ దశరథ్
- రచయితగా ఎంట్రీ ఇచ్చిన దశరథ్
- దర్శకుడిగానూ అందుకున్న హిట్లు
- ఫ్యామిలీ పరంగా పూర్తి సంతృప్తి అని వెల్లడి
- పేరెంట్స్ లేకపోవడం పట్ల ఆవేదన
రచయితగా .. దర్శకుడిగా దశరథ్ కి మంచి పేరు ఉంది. ఇక తాజాగా ఆయన నిర్మాతగా కూడా మారారు. ప్రస్తుతం ఆయన ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో దశరథ్ మాట్లాడుతూ తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు. "నేను రైటర్ గా వచ్చాను .. కానీ నాకు డైరెక్టర్ ను కావాలని ఉండేది" అన్నారు.
"నేను డైరెక్షన్ వైపు వెళదామని అనుకుంటే, కొంతమంది తెలిసిన నిర్మాతలు రైటర్ గా తమ సినిమాలు చేసి పెట్టమని అడిగేవారు. దాంతో నేను కాదనలేకపోయేవాడిని. రైటర్ గా చేస్తున్నప్పుడు చూస్తుండగానే కాలం చాలా వేగంగా గడిచిపోతూ ఉంటుంది. నా విషయంలో ఇదే జరిగింది. రైటర్ గా కొనసాగుతుండటం వలన, డైరెక్టర్ గా ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. అందుకు కారణం నాకున్న మొహమాటం .. ఎవరికీ 'నో' చెప్పలేకపోవడం అనే విషయం నాకు కొంచెం ఆలస్యంగా అర్థమైంది" అని చెప్పారు.
"ఫ్యామిలీ పరంగా నేను సంతోషంగా .. సంతృప్తికరంగా ఉన్నాను. మా పిల్లలను తీసుకుని నేను ఫంక్షన్స్ కీ వాటికి వెళుతుంటాను. కొంతమంది వాళ్ల పేరెంట్స్ ను కూడా తీసుకుని వస్తుంటారు. అప్పుడు నాకు మా అమ్మానాన్నలు గుర్తొస్తారు. నా చిన్న వయసులోనే వాళ్లు పోయారు. వాళ్లు ఉండి ఉంటే బాగుండునని అనిపిస్తూ ఉంటుంది" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.